తెలంగాణలో మారుతున్న పోలిటికల్ ఈక్వేషన్స్…

0

తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. బీజేపీ ఆపరేషన్ కమలంతో దూకుడుగా వెళ్లడంతో రాజకీయ సమీకరణలు ఒక్కసారిగా మారిపోనున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో కనుమరుగవుతున్న టీడీపీని వీడేందుకు చాలామంది నేతలు సిద్ధమయ్యారు. వీరంతా ఈ నెల 18న హైదరాబాద్ లో జరిగే బహిరంగ సభలో బీజేపీలో చేరనున్నారు. అలాగే కొందరు కాంగ్రెస్ నాయకులు కూడా బీజేపీ తీర్ధం పుచ్చుకుంటారని తెలుస్తోంది.

అయితే ప్రతిపక్ష కాంగ్రెస్- టీడీపీలనే కాకుండా బీజేపీ అధికార టీఆర్ ఎస్ ని కూడా టార్గెట్ చేసిందని తెలుస్తోంది. కొందరు టీఆర్ ఎస్ లో అసంతృప్తిగా ఉన్న నేతలు తమతో టచ్ లో ఉన్నారని బీజేపీ నేతలు చెబుతున్నారు. అందులో ఎమ్మెల్యేలు కూడా ఉన్నారని బీజేపీ చెబుతోంది. రాజధాని హైదరాబాద్ శివారు నియోజకవర్గాలకు చెందిన ఓ ముగ్గురు ఎమ్మెల్యేలు కరీంనగర్ జిల్లా నుంచి ఇద్దరు నిజామాబాద్ నుంచి మరో ఇద్దరు ఆదిలాబాద్- మెదక్ నుంచి కూడా ఒక్కొక్కరు తమతో టచ్ లో ఉన్నారని బీజేపీ మైండ్ గేమ్ వ్యాఖ్యలు చేస్తోంది.

అయితే ఎమ్మెల్యేలు రావడం అనేది కష్టమనే చెప్పాలి. మైండ్ గేమ్ లో భాగంగానే ఈ వ్యాఖ్యలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఎమ్మెల్యేలని పక్కన బెడితే కొందరు నేతలు మాత్రం బీజేపీలోకి వెళతారని సమాచారం. టీఆర్ ఎస్ మీద అసంతృప్తితో ఉన్న వరంగల్- నల్గొండ- నిజామాబాద్- కరీంనగర్ జిల్లాలో కొందరు నేతలు.. తమకు మంచి పదవులు ఇస్తే బీజేపీలోకి వస్తామని చెప్పినట్లు తెలుస్తోంది. మున్సిపల్ ఎన్నికలని దృష్టిలో పెట్టుకుని టీఆర్ ఎస్ నేతలనీ చేర్చుకునేందుకు బీజేపీ సిద్ధంగా ఉంది.

ఎంతకాదు అనుకున్న టీఆర్ ఎస్ అధికారంలో ఉండటం వల్ల ఆ పార్టీని వీడటానికి ఎవరు పెద్దగా సిద్ధంగా ఉండరు. కానీ బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉండటం..ఏమైనా పదవులు- కాంట్రాక్టులు ఇస్తామని ఎర వేస్తే లొంగిపోవచ్చు. అలాగే మున్సిపల్ ఎన్నికలు కూడా ఉండటంతో టీఆర్ ఎస్ లో ఉంటే సీటు రాదు… బీజేపీలోకి వెళితే వస్తుందని అనుకుంటే పార్టీ మారే అవకాశం ఉంది. రానున్న రోజుల్లో తెలంగాణలో రాజకీయ సమీకరణలు ఎలా మారుతాయో… ఎవరు బీజేపీలో చేరుతారో చూడాలి.
Please Read Disclaimer