కీర్తి సురేష్ సినిమా వివాదం.. ప్రొడ్యూసర్స్ పై కేసు నమోదు…!

0

మలయాళ బ్యూటీ కీర్తి సురేష్ ‘నేను శైలజ’ సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిందనే విషయం అందరికీ తెలిసిందే. అయితే దీని కంటే ముందే కీర్తి మరో సినిమాలో నటించిందని కొందరికి మాత్రమే తెలుసు. సీనియర్ నటుడు నరేష్ తనయుడు నవీన్ విజయ కృష్ణ హీరోగా కీర్తి సురేష్ ని తెలుగు చిత్ర పరిశ్రమలో ఇంట్రడ్యూస్ చేస్తూ ‘ఐనా ఇష్టం నువ్వు’ అనే సినిమా ప్రారంభించారు. రామ్ ప్రసాద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఫ్రెండ్లీ మూవీస్ బ్యానర్ పై చంటి అడ్డాల నిర్మించారు. అప్పుడెప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా అనుకోని కారణాల వల్ల బయటకు రాలేదు. అయితే ఈ సినిమా హక్కులు తీసుకున్న ప్రముఖ నిర్మాత నట్టి కుమార్ నట్టిస్ ఎంటర్టైన్మెంట్స్ – క్విటీస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఇటీవల ‘ఐనా ఇష్టం నువ్వు’ పోస్టర్ రిలీజ్ చేశారు. ప్యాచ్ వర్క్ ఉందని.. అది కూడా పూర్తి చేసి రిలీజ్ చేస్తామని చెప్పుకొచ్చారు. అదే సమయంలో నిర్మాత చంటి అడ్డాల ఈ సినిమా టైటిల్ ని ‘జానకితో నేను’ అని మార్చామని చెప్తూ మరో పోస్టర్ రిలీజ్ చేశారు. ఇలా ఒకే సినిమాని రెండు టైటిల్స్ తో ప్రమోట్ చేసారు.

ఈ నేపథ్యంలో సినీ నిర్మాత నట్టి కుమార్ కుమారుడు – కుమార్తె లపై అడ్డాల చంటి బంజారాహిల్స్ పోలీసులు ఫిర్యాదు చేశారు. సినీ హక్కుల విషయంలో తనను మోసం చేశారంటూ ఆయన కంప్లైంట్ చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్ కళింగరావు కథనం ప్రకారం.. సినిమాకు సంబంధించి ప్రసార శాటిలైట్ డిజిటల్ రైట్స్ చంటి అడ్డాల వద్ద ఉన్నాయి. ఆ రైట్స్ తమకు విక్రయించాలని నట్టి క్రాంతి నట్టి లక్ష్మీకరుణ కొంతకాలం క్రితం చంటిని సంప్రదించారు. ఇందుకోసం రూ.45 లక్షలు మూడు వాయిదాల్లో చెల్లిస్తామని ఒప్పందం చేసుకుని మూడు చెక్కులిచ్చారు. అయితే చెక్కుల్లో ఉన్న అమౌంట్ లో తేడా ఉండటంతో మరో మూడు చెక్కులు ఇస్తామని చెప్పారు. అయితే రోజులు గడుస్తున్నా వారి నుంచి రెస్పాన్స్ లేకపోవడంతో చంటి ఆ సినిమా హక్కుల ఒప్పందాన్ని రద్దు చేసుకున్నారు. అంతేకాకుండా వారిద్దరిపై తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో కూడా చంటి ఫిర్యాదు చేశారని తెలుస్తోంది.