ఛార్మి.. స్టార్ ప్రొడ్యూసర్ కావడమే లక్ష్యమా?

0

హీరోయిన్ గా ఛార్మి మంచి సక్సెస్ చూసింది. పెద్ద స్టార్ హీరోల సినిమాల్లో నటించింది. ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు కూడా సాధించింది. అయితే ఎలాంటి హీరోయిన్ అయినా ఒక దశ తర్వాత ఫేడ్ అవుట్ కావడం సాధారణమైన విషయమే. అప్పుడు ఎలా తమ కెరీర్ ను కొనసాగిస్తారనేది ముఖ్యం. సరిగ్గా ఇలాంటి సమయంలోనే ఛార్మి నిర్మాణం వైపు అడుగులు వేసింది. డాషింగ్ పూరి జగన్నాధ్ క్యాంప్ లో సహనిర్మాతగా కొత్త కెరీర్ మొదలు పెట్టింది. మొదట్లో కొన్ని ఎదురు దెబ్బలు తగిలినప్పటికీ ‘ఇస్మార్ట్ శంకర్’ తో ఒక్కసారిగా భారీ విజయం సాధించి విమర్శకుల నోర్లు మూయించింది.

పూరి దర్శకత్వంలో తెరకెక్కే సినిమాల నిర్మాణ వ్యవహారాలను ఛార్మి స్వయంగా హ్యాండిల్ చేస్తోందనేది అందరికీ తెలిసిందే. ఇప్పుడు పూరి కనెక్ట్స్ బ్యానర్ లో క్రేజీ సినిమాలను లైన్లో పెడుతున్నారు. ‘ఇస్మార్ట్ శంకర్’ కంటే ముందే షూటింగ్ ప్రారంభించిన ‘రొమాంటిక్’ ను పక్కనపెడితే యువ హీరో విజయ్ దేవరకొండ తో ‘ఫైటర్’ అనే క్రేజీ ప్రాజెక్టు కు ప్రీ ప్రొడక్షన్ జరుగుతోంది. ఈ సినిమాను ప్యాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారు.

ఇదొక్కటే కాకుండా ఇండస్ట్రీలో ఉన్న కొందరి ఆధిపత్యం తగ్గించే దిశగా కూడా కొన్ని కీలకమైన అడుగులు ఛార్మి వేస్తోందని కూడా టాక్ ఉంది. ‘ఇస్మార్ట్ శంకర్’ నైజామ్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ను కొత్తవారికి ఇవ్వడం వెనక ఉన్న కారణం అదేనని అంటున్నారు. ఇకపై తమ సినిమాల పంపిణీ విషయంలో ఇదే పద్ధతి కొనసాగించాలనే ఆలోచనలో ఛార్మి ఉందట. ఈ పరిణామాలు గమనిస్తుంటే ఛార్మి స్టార్ ప్రొడ్యూసర్ అయ్యే దిశగా అడుగులు వేస్తోందని కామెంట్లు వినిపిస్తున్నాయి.
Please Read Disclaimer