ఛపాక్: క్లిష్టమైన పాత్రలో మెప్పించిన దీపిక

0

మెయిన్ స్ట్రీమ్ సినిమాలలో.. స్టార్ల చిత్రాలలో కమర్షియల్ ఎలిమెంట్స్ కే పెద్ద పీట ఉంటుంది. ప్రయోగాలను అసలు ఆశించలేం. అయితే గత కొంతకాలంగా బాలీవుడ్ స్టార్లు కొందరు ఇలాంటి మూసకు భిన్నంగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. ఆమిర్ ఖాన్.. అక్షయ్ కుమార్ లాంటివారు తమ సినిమాలతో ఇప్పటికే విభిన్న కథలను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. హీరోయిన్లు కూడా ఈ ట్రెండ్ ను కొనసాగిస్తున్నారు. తాజాగా దీపిక పదుకొనె ‘ఛపాక్’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఈ సినిమాలో దీపిక పదుకొనె యాసిడ్ దాడి బాధితురాలిగా నటించింది. ఇదో నిజ జీవిత కథ. యాసిడ్ దాడి బాధితురాలైన లక్ష్మీ అగర్వాల్ జీవితం ఆధారంగా ఈ సినిమాను దర్శకురాలు మేఘన గుల్జార్ ఈ సినిమాను తెరకెక్కించారు. యాసిడ్ దాడి కారణంగా ఒక అమ్మాయి జీవితం ఎలా మారిపోతుంది? ఆ అమ్మాయి పడే మానసిక సంఘర్షణ ఎలా ఉంటుంది? సమాజం ఇలాంటి వాటి పట్ల ఎలా స్పందిస్తుంది అనే పలు అంశాలను ఈ సినిమాలో చర్చించారు. యాసిడ్ దాడికి గురికావడంతో దీపిక జీవితం ఒక్క సారిగా తల్లకిందులు అవుతుంది. ఇలాంటి సమయంలో దీపిక ఎలా ఆత్మవిశ్వాసంతో ఆ పరిస్థితులను ఎదుర్కొంది.. ఇతర యాసిడ్ దాడి బాధిత మహిళలకు ఎలా అండగా నిలిచింది అనేది అసలు కథ.

కథ.. కథనాలు కొన్ని చోట్ల నెమ్మదిగా ఉన్నాయనిపించినా సినిమా మాత్రం ప్రేక్షకుల హృదయాలను కదిలిస్తుంది. సినిమాలో దీపిక ఎక్కువ భాగం డీగ్లామరైజ్డ్ గా కనిపించింది. సంక్లిష్టమైన పాత్రలో దీపిక చక్కగా ఒదిగిపోయింది. దర్శకురాలు మేఘన ఈ సినిమాను వీలైనంత రియలిస్టిక్ గా ఉండేలా తెరకెక్కించారు. మంచి సినిమాలను.. అర్థవంతమైన సినిమాలను ఇష్టపడేవారు ఎటువంటి పరిస్థితుల్లోనూ మిస్ చేయకూడని సినిమా ఇది.
Please Read Disclaimer