చిన్మయి వరకూ హీరోలు వారేనట

0

సమంతకు ఇంత క్రేజ్ రావటం వెనుక ఆమె అందచందాల సంగతి ఎలా ఉన్నా.. మొదటిచిత్రంలోనే ఆమె గొంతులోని గమ్మత్తు యూత్ ను ఎంతలా ఊగిపోయేలా చేసిందో తెలిసిందే. సమంత మాట వెనుక ఉన్న అసలు అందం గాయని కమ్ డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి అన్నది తెలిసిందే. మిగిలిన హీరోయిన్లకు భిన్నంగా నిలిపేలా చేసింది చిన్మయి వాయిస్.

దీంతో.. మొదటి సినిమా విడుదలైన రోజు నుంచే.. జెస్సీ.. జెస్సీ అంటూ యూత్ ఊగిపోయింది. కట్ చేస్తే.. ఇప్పటివరకూ ఆమెకు ఎదురులేని విధంగా సాగింది. సమంత సంగతి ఇలా ఉంచితే.. తనదైన వాయిస్ తో మిగిలిన వారికి భిన్నంగా నిలవటమే కాదు.. చేతల్లోనూ చిన్మయి మిగిలిన వారికి పూర్తి భిన్నం.

తనకు జరిగే అన్యాయం మీద గళం విప్పటానికి ఏ మాత్రం వెనుకాడని ధైర్యం ఆమె సొంతం. మీటూ ఉద్యమం నేపథ్యంలో తాను ఎదుర్కొన్న చేదు వాస్తవాల్ని బయటపెట్టేందుకు ఆమె వెనుకాడలేదు. ఈ క్రమంలో ప్రముఖ రచయిత వైరముత్తుపై ఆమె చేసిన ఆరోపణలు సంచలనంగా నిలిచాయి. కానీ.. ఆమె మాటల్ని పరిగణలోకి తీసుకొని ఆ పెద్ద మనిషిపై చర్యలు తీసుకోవటం వదిలేసి.. ఆమెపై బ్యాన్ విధించటాన్ని మర్చిపోలేం.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. తనకు జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడేందుకు ఆమె కోర్టును ఆశ్రయించారు. దీనికి సంబంధించిన విచారణ సాగుతోంది. మరోవైపు ఆమెకు అవకాశాల్లేకుండా చేసి ఏడాది అవుతోంది. ఈ సమయంలో ఆమెకు తాజాగా ఒక ఆఫర్ వచ్చింది.

శివకార్తికేయన్ హీరోగా నటిస్తున్న హీరో చిత్రం కోసం ఆమె డబ్బింగ్ ఆర్టిస్ట్ గా పని చేశారు. ఈ చిత్రంలోని హీరోయిన్ కు చిన్మయి గొంతు ఇచ్చారు. దీనిపై స్పందిస్తూ.. దాదాపు ఏడాది తర్వాత తాను మళ్లీ డబ్బింగ్ చెప్పినట్లుగా పేర్కొన్నారు. తనకు అవకాశం ఇచ్చిన దర్శకుడు మిత్రన్.. నిర్మాతకు ఆమె మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పారు. తనకు తెలిసినంతవరకూ వారే నిజమైన హీరోలుగా ఆమె పేర్కొన్నారు. నిజమే మరి.. టాలెంట్ ఉన్నా.. అన్యాయం మీద గళం విప్పిన ఆమెకు అండగా నిలిచేందుకు ఇప్పటివరకూ ఎవరూ ముందుకు రాని వేళ.. వచ్చిన వారు కచ్ఛితంగా హీరోలే అవుతారుగా మరి.
Please Read Disclaimer