మెగాస్టార్ 152: సింహాచలం కాలనీ సెట్

0

మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న 152 వ చిత్రం పనులు వేగవంతమయ్యాయి. కీలక శాఖల సమన్వయంతో కొరటాల పనులన్నింటినీ వేగంగా పూర్తిచేసే పనిలో పడ్డాడు. డిసెంబర్ లో రెగ్యులర్ షూట్ కి వెళ్లనున్న నేపథ్యంలో ముందస్తుగా అన్ని పనులు పూర్తిచేసి సర్వం సిద్దంగా ఉండాలని ఆదేశాలు జారీ చేసాడు. దానికి తగ్గట్టు యూనిట్ ప్రణాళిక బద్దంగా మందుకెళ్తోంది. ఈ నేపథ్యంలో సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ అందింది. చిత్రీకరణలో భాగంగా హైదరాబాద్ శివారు కోకాపేటలో చిరంజీవి సొంత స్థలంలో రెండు భారీ సెట్లను నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది.

విశాఖలో కొలువున్న సింహాచలేశుని టెంపుల్ అక్కడి ఆవరణాన్ని తలపించేలా ఓ సెట్ ని కోకాపేట లో నిర్మిస్తున్నారు. అలాగే… ఓ కాలనీ సెట్ నిర్మిస్తున్నట్లు సమాచారం. కొరటాల ఆర్ట్ డైరెక్టర్ సెట్ డిజైన్ నిర్మాణం పనుల్లో బిజీ అయినట్లు తెలిసింది. సినిమా లో ఈ రెండు సెట్లు వాస్తవ వాతావరణాన్ని తలపిస్తాయని అంటున్నారు. ఇదే చోట సైరా నరసింహారెడ్డి కోసం భారీ సెట్లు నిర్మించిన సంగతి తెలిసిందే. వాటిని కూలగొట్టి వీటిని నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో గుణశేఖర్ దర్శకత్వంలో మహేష్ బాబు కథా నాయకుడిగా నటించిన అర్జున్ సినిమా కోసం ఇలాగే తమిళనాడు లోని మధురై టెంపుల్ సెట్ ను హైదరాబాద్ లో నిర్మించి వాస్తవ అనుభూతిని కల్గించాడు.

ఈ నేపథ్యంలో చిరు 152 కోసం నిర్మిస్తోన్న సింహాచలం టెంపుల్ సెట్ కూడా వాస్తవాన్ని ప్రతి బింబిస్తోందని ఆర్ట్ విభాగం ధీమా వ్యక్తం చేస్తోంది. ఇందులో చిరు ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. అలాగే కథలో కొరటాల నక్సలిజం అంశాన్ని టచ్ చేసినట్లు వినిపిస్తోంది. ఇప్పటికే పొలిటికల్ థ్రిల్లర్ అని బయట హాట్ టాపిక్. తాజాగా నక్సలిజం అనే సెన్సేషనల్ పాయింట్ తో ప్రచారం మరింత వేడెక్కుతోంది.
Please Read Disclaimer