మళ్ళీ మొదలైన ఆ నలుగురి హవా!

0

టెక్నాలజీ పైరసీ ఇంత తీవ్రంగా ప్రభావం చూపలేని కాలంలో తెలుగు సినిమా దేదీప్యమానంగా వెలిగింది. టాక్ బాగుంటే చాలు ఈజీగా వంద రోజులు ఒకే థియేటర్లో ఆడే స్వర్ణయుగం అది. మరీ బ్లాక్ అండ్ వైట్ కాలానికి వెళ్లాల్సిన అవసరం లేదు కానీ జస్ట్ ఓ పాతికేళ్ళు వెనక్కు వెళ్తే తెరను ఏలే నలుగురు హీరోలు చిరంజీవి – బాలకృష్ణ – నాగార్జున – వెంకటేష్ ల వైభవం ఓ రేంజ్ లో ఉండేది. ఏడాదికి మూడు నాలుగు సినిమాలు చేస్తూ టికెట్ కౌంటర్లను కళకళలాడేలా చేసేవారు.

వయసు ప్రభావం వల్ల మునుపటి దూకుడు ప్రదర్శించడం ఆ మధ్య కాస్త తగ్గినా ఇప్పుడు మాత్రం మళ్ళీ స్పీడ్ పెంచుతూ కుర్ర హీరోలకు సవాల్ విసిరేలా ఉన్నారు. ఎనిమిదేళ్ల గ్యాప్ తర్వాత ఖైదీ నెంబర్ 150తో కం బ్యాక్ ఇచ్చిన మెగాస్టార్ 100 కోట్లు కొల్లగొడతారని ఎవరూ ఊహించలేదు. సైరా మీద వస్తున్న క్రేజ్ చూస్తుంటే ట్రేడ్ సైతం షాక్ అవుతోంది. ఇంకా షూటింగ్ స్టార్ట్ కాకుండానే కొరటాల శివ సినిమా తాలూకు ఫోటో షూట్ ఆన్ లైన్ లో రచ్చ చేస్తోంది.

ఇక బాలకృష్ణ ఎన్నడూ స్పీడ్ తగ్గించలేదు కానీ సింహం నాలుగు అడుగులు వెనక్కు జరిగిన తరహాలో ఎన్టీఆర్ బయోపిక్ తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న మాట వాస్తవమే కానీ ఇకపై వేగంగా సినిమాలు చేసేలా పక్కా ప్లానింగ్ జరుగుతోందట. కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ మొదలుకావడం ఆలస్యం ఇంకో రెండు స్క్రిప్ట్స్ రెడీ అవుతాయని తెలిసింది. ఎఫ్2 ఇచ్చిన కిక్ జోరుమీదున్న వెంకటేష్ వెంకీ మామతో మరోసారి సత్తా చాటేందుకు రెడీ అవుతున్నారు.

ఇక ఈ శుక్రవారమే నాగార్జున మన్మథుడు 2 ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఆయన లుక్స్ తో పాటు ట్రైలర్ అంచనాలు పెంచేసింది. ఇలా మళ్ళీ ఈ నలుగురు తమ వైభవాన్ని పునఃసృష్టి చేస్తూ యువ హీరోలకు పోటీగా మారుతున్నారు. చిన్న సినిమాలకు ఆదరణ అతి కష్టంగా మారిన తరుణంలో వీటిని టీవీలోనో డిజిటల్ రూపంలోనో చూసి పెద్ద హీరోలవి మాత్రం థియేటర్లో చూద్దామని పబ్లిక్ అనుకుంటే మాత్రం ఇబ్బందులు తప్పవు. దేనికైనా కంటెంటే ముఖ్యం కానీ స్టార్ వేల్యూ తోడైనప్పుడు సేఫ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. చూడాలి ఈ నలుగురు సీనియర్ల ప్రభావం ఇండస్ట్రీ మీద రానున్న రోజుల్లో ఎలా ఉండబోతోందో.
Please Read Disclaimer