హాట్ టాపిక్: ఇస్మార్ట్ డైరెక్టర్ తో మెగా టాక్

0

మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘సైరా’ కు భారీ ఆదరణ దక్కిన నేపథ్యంలో కళాబంధు టీ. సుబ్బరామి రెడ్డి హైదరాబాద్ లోని పార్క్ హయత్ హోటల్ లో సక్సెస్ పార్టీ ఇచ్చారు. ఈ పార్టీలో నందమూరి బాలకృష్ణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన సంగతి తెలిసిందే. బయట ఎవరు ఎలా మాట్లాడినా బాలయ్య చిరుల మధ్య ఉండే అనుబంధం ఎప్పుడూ అందరినీ ఆకర్షిస్తూ ఉంటుంది. ఈ వేడుకలో ‘సైరా’ టీమ్ సభ్యులతో పాటుగా టి.సుబ్బరామి రెడ్డి.. మురళి మోహన్.. అల్లు అరవింద్.. శ్యామ్ ప్రసాద్ రెడ్డి.. దిల్ రాజు.. పూరి జగన్నాధ్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సక్సెస్ పార్టీ సూపర్ సక్సెస్ అని.. మెగాస్టార్ ఈ పార్టీని ఫుల్ గా ఎంజాయ్ చేశారని టాక్. అతిథులతో ముచ్చట్లాడుతూ చిరు ఎంతో సరదాగా గడిపారట. ఈ పార్టీలో అందరినీ ఆకర్షించిన విషయం మరొకటి తాజాగా బయటకు వచ్చింది. ఈ పార్టీలో డైరెక్టర్ పూరి జగన్నాధ్ ను చిరు చాలాసేపు ముచ్చటించారట. ఇద్దరూ అంతసేపు ఏం మాట్లాడుకున్నారో తెలియదు కానీ ఇద్దరి సాన్నిహిత్యం చూసినవారికి మాత్రం ముచ్చటగా అనిపించిందట. మెగాస్టార్ కు పూరి పెద్ద ఫ్యాన్ అనే సంగతి అందరికీ తెలిసిందే. అయితే పూరి దాదాపు అందరూ స్టార్ హీరోలతో పని చేశారు కానీ చిరుతో మాత్రం పని చేసే అవకాశం ఇప్పటివరకూ రాలేదు.

మెగాస్టార్ రీ ఎంట్రీ సినిమా ఛాన్స్ పూరి జగన్నాధ్ కే వచ్చి ఉండేది కానీ తృటిలో ఆ ఛాన్స్ మిస్ అయింది. చిరు కోసం పూరి అప్పట్లో ‘ఆటో జానీ’ కథను తయారు చేసిన సంగతి తెలిసిందే. అయితే సెకండ్ హాఫ్ పట్ల చిరు సంతృప్తికరంగా లేకపోవడంతో ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. చిరు ఆ విషయం ఒక ఇంటర్వ్యూలో చెప్పడంతో పూరి కూడా అప్సెట్ కావడం.. తర్వాత చరణ్ సర్ది చెప్పడంతో ఆ ఇష్యూ సద్దుమణిగింది. మెగాస్టార్ తో ఎప్పటికైనా సినిమా తెరకెక్కించాలన్నదే తన డ్రీమ్ అని అప్పట్లో పూరి చెప్పారు. కానీ ఆయన ఫామ్ లో లేకపోవడంతో దానిసంగతి అందరూ మర్చిపోయారు. ఇప్పుడు ‘ఇస్మార్ట్ శంకర్’ తో పూరి మళ్ళీ ఫామ్ లోకి వచ్చారు కాబట్టి ఫ్యూచర్ లో ఛాన్స్ ఉన్నట్టే. మరి ఏం జరుగుతుందో చూడాలి.
Please Read Disclaimer