చిరు రిఫరెన్సులు.. మెగా ఫ్యాన్స్ హ్యాపీనా?

0

న్యాచురల్ స్టార్ నాని కొత్త సినిమా ‘గ్యాంగ్ లీడర్’ ట్రైలర్ ఈరోజే విడుదలైంది. ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. రీసెంట్ గా నాని ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు ఒక ట్రీట్ ఉందని వెల్లడించిన విషయం తెలిసిందే. నాని చెప్పినట్టే ఈ ట్రైలర్ లో మెగాస్టార్ చిరంజీవికి సంబంధించిన రెండు రిఫరెన్సులు ఉండడం విశేషం. ఒక సీన్లో చిరంజీవి మాస్క్ తో కనిపించాడు. మరో సీన్ లో ఒరిజినల్ ‘గ్యాంగ్ లీడర్’ చిరు స్టైల్ లో నాని వెల్డింగ్ చేస్తూ కనిపించాడు.

మరి ఈ రెండు సీన్లు మెగా ఫ్యాన్స్ ను కూల్ చేయడానికే అనేది సుస్పష్టం. ‘గ్యాంగ్ లీడర్’ టైటిల్ ను ఈ చిత్రానికి ప్రకటించిన సమయంలో కొందరు మెగా ఫ్యాన్స్ నుంచి వ్యతిరేకత వ్యక్తం అయింది. చిరు కెరీర్ లో ‘గ్యాంగ్ లీడర్’ కు ఓ ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ టైటిల్ ను రామ్ చరణ్ లాంటి మెగా హీరో వాడుకుంటే బాగుంటుందని వారి ఉద్దేశం. అందుకే నాని ఈ సినిమాకు ‘గ్యాంగ్ లీడర్’ టైటిల్ ప్రకటించగానే వ్యతిరేకత వచ్చింది. మరో నిర్మాత కూడా ఈ టైటిల్ ను రిజిస్టర్ చేసి పెట్టుకున్న విషయం బైటకు రావడంతో కొందరు షాక్ తిన్నారు. అయితే మెగా ఫ్యాన్స్ నుండి వ్యతిరేకత వచ్చిన తర్వాత కూడా నాని – విక్రమ్ కుమార్ టీమ్ అదే పేరుతో ముందుకు వెళ్ళారు. ఇలాంటి సందర్భాల్లో సహజంగా హీరో పేరు టైటిల్ కు జోడిస్తారు. గతంలో ‘ఖలేజా’.. ‘కత్తి’ సినిమాలకు చేసినట్టే ‘గ్యాంగ్ లీడర్’ కు కూడా హీరో పేరు తగిలించి ‘నానీస్ గ్యాంగ్ లీడర్’ గా మార్చారు. అయితే ఈ విషయంపట్ల మెగా ఫ్యాన్స్ గుర్రుగా ఉన్నారని.. వారిని కూల్ చేసేందుకే ట్రైలర్ లో చిరు రిఫరెన్స్ ఉండేలా జాగ్రత్త పడ్డారని అంటున్నారు.

అంతా బాగానే ఉంది కానీ ఈ రిఫరెన్సులతో మెగా ఫ్యాన్స్ హ్యాపీ అయ్యారా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ వారు శాంతిస్తే మాత్రం ఏమీ ఇబ్బంది ఉండదు. అలా కాకుండా ఉంటే మాత్రం ‘గ్యాంగ్ లీడర్’ రిలీజ్ అయినప్పుడు నాని సినిమాకు ట్రోలింగ్ తప్పదనే అభిప్రాయం వినిపిస్తోంది. ఏం జరుగుతుందో తెలియాలంటే మాత్రం సెప్టెంబర్ 13 వరకూ వేచి చూడాలి.
Please Read Disclaimer