మెగాస్టార్ అతిధిగా ఎస్వీఆర్ కాంస్య విగ్రహావిష్కరణ

0

విశ్వ నటచక్రవర్తి కీ.శే. ఎస్వీ రంగారావు అసమాన నటప్రతిభ గురించి ప్రత్యేకించి పరిచయం అవసరం లేదు. `మాయాబజార్` చిత్రంలో ఘటోత్కచునిగా ఆయన నటవైధుష్యం ఇప్పటికీ ఆల్ టైమ్ యూత్ ఫేవరెట్ గా ఉందంటే ఆయన ప్రతిభకు అంతకంటే కొలమానం ఏం కావాలి? ఎన్నో వైవిధ్యం ఉన్న పాత్రల్లో ఆయన సినిమాకి చేసిన సేవల్ని అభిమానులు విస్మరించలేదు. అందుకే తెలుగు రాష్ట్రాల్లో ఎస్వీ రంగారావు అభిమాన సంఘాలు నిరంతరం ఏదో ఒక యాక్టివిటీతో ప్రజలకు చేరువగానే ఉంటున్నాయి.

తాజాగా తాడేపల్లి గూడెం యస్.వి.ఆర్. సర్కిల్ .. కె.యన్.రోడ్ లో ఆయన కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి. ఈ నెల 25(ఆదివారం)న ఉదయం 10.11 నిమిషాలకు ఎస్వీఆర్ అభిమానుల సమక్షంలో పద్మభూషణుడు-మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ఈ విగ్రహావిష్కరణ జరగనుంది. ఆ మేరకు అధికారికంగా ఆహ్వాన పత్రిక ను ముద్రించడం విశేషం. ప్రస్తుతం ఈ పోస్టర్ మెగాభిమానుల సమాజిక మాధ్యమాలు సహా వాట్సాప్ లలో వైరల్ గా మారింది.

ఎస్వీఆర్ స్వగతం పరిశీలిస్తే.. ఆయన పూర్తి పేరు సామర్ల వెంకట రంగారావు. 3 జూలై 1918 లో జన్మించారు. 18 జూలై 1974లో గుండెపోటుతో పరమపదించారు. మద్రాసు పరిశ్రమలో ఉండగానే ఆయన ప్రముఖ సినీ నటుడిగా.. దర్శకరచయితగా పాపులరయ్యారు. కృష్ణా జిల్లా- నూజివీడులో జన్మించిన రంగారావు కొద్ది రోజులు మద్రాసు – ఏలూరు – విశాఖపట్నంలో చదువుకున్నారు. చదువుకునే రోజుల నుంచీ నాటకాల్లో నటించారు. షేక్ స్పియర్ డ్రామాల్లో నటించిన అనుభవంతోనే సినీనటుడు అయ్యారు. చదువు పూర్తయిన తర్వాత ఫైర్ ఆఫీసరుగా కొద్ది రోజులు ఉద్యోగం చేసిన ఆయన నటనపై పూర్తి స్థాయిలో దృష్టి సారించడం కోసం ఉద్యోగానికి రాజీనామా చేశారు. 1946లో వచ్చిన వరూధిని అనే చిత్రం ఆయనకు నటుడిగా తొలి చిత్రం. అయితే ఈ చిత్రం ఆశించినంతగా విజయవంతం కాకపోవడంతో మళ్ళీ సినిమా అవకాశాలు రాలేదు. కొద్ది రోజులు జంషెడ్పూర్ లోని టాటా సంస్థలో ఉద్యోగం చేశారు. మళ్ళీ సినిమా అవకాశాలు రావడంతో అక్కడి నుంచి వచ్చేసి దాదాపు మూడు దశాబ్దాల పాటు తెలుగు- తమిళ- కన్నడ – మలయాళ-హిందీ భాషల్లో 300 పైగా చిత్రాల్లో నటించారు. రావణుడు – హిరణ్య కశిపుడు – ఘటోత్కచుడు – కంసుడు – కీచకుడు – నరకాసురుడు – మాంత్రికుడు లాంటి ప్రతినాయక పాత్రలతో పౌరాణికాల్లో గొప్ప నటుడిగా పేరు తెచ్చుకున్నారు. సాంఘీకంలోనూ అనేక సహాయ పాత్రలలో తనదైన ముద్ర వేశాడు. పాతాళ భైరవి – మాయాబజార్ – నర్తనశాల ఆయన ప్రముఖ పాత్రలు పోషించిన కొన్ని సినిమాలు. నర్తనశాలలో ఆయన నటనకు గాను భారత రాష్ట్రపతి పురస్కారమే కాక ఇండోనేషియా ఫిల్మ్ ఫెస్టివల్ పురస్కారం కూడా అందుకున్నారు. ఆయన దర్శకత్వం వహించిన రెండవ చిత్రం బాంధవ్యాలు ఉత్తమ చిత్రంగా నంది పురస్కారం అందుకుంది. విశ్వనట చక్రవర్తి – నట సార్వభౌమ – నటసింహ ఈయన బిరుదులు. 1974 లో యాభై ఆరేళ్ళ వయసులో మద్రాసులో గుండెపోటుతో మరణించాడు. నటుడిగా ఆయన చివరి చిత్రం యశోదకృష్ణ (1975).Please Read Disclaimer

మీ ఇంటివద్దే ఉచితం గా మాస్క్ తయారు చేసుకోండి ఇలా!? How to Make your own mask at Home