మెగాస్టార్ చిరంజీవి బయోగ్రఫీ

0

మెగాస్టార్ చిరంజీవి జీవితంపై ఇప్పటికే ఎన్నో పుస్తకాలు.. సంకలనాలు వచ్చాయి. మద్రాసు పరిశ్రమ నుంచి చిరుతో అనుబంధం ఉన్న సీనియర్ సినీపాత్రికేయుడు పసుపులేటి రామారావు ఇప్పటికే ఆయనపై పుస్తకాలు రాశారు. చిరంజీవితం- సినీప్రస్థానం.. చిరంజీవితం 150 పేరుతో పుస్తకాలు ఇప్పటికే రిలీజయ్యాయి. అవి మెగాభిమానుల్లో స్ఫూర్తి నింపాయి. తాజాగా మెగాస్టార్ బయోగ్రఫీ రచనకు మరో సీనియర్ జర్నలిస్ట్ వినాయకరావు సంకల్పించారు. ఇప్పటికే పుస్తకం రెడీ అవుతోందని అఖిలభారత చిరంజీవి యువత అధ్యక్షుడు రవణం స్వామినాయుడు ఇంతకుముందు వెల్లడించారు.

తాజాగా రచయిత నుంచి ప్రకటన వెలువడింది. చిరంజీవి జీవితచరిత్రపై పుస్తకాన్ని రచిస్తున్నానని సినీజర్నలిస్ట్.. పుస్తక రచయిత వినాయకరావు సినీమీడియాకు వెల్లడించారు. “ఇంద్రధనస్సులోని సప్తవర్ణాల్ని అద్దుకున్న.. సుందర సురుచిర కావ్యం.. మెగాస్టార్ శ్రీ చిరంజీవి జీవిత చరిత్ర అనే మహాకావ్యం… అది నవ్యాతినవ్యం.. ఒక్కో పేజీ తిరగేస్తుంటే కన్రెప్పల వాకిట్లో ఈస్ట్ మన్ కలర్ ఫుల్ కలలెన్నో కూచిపూడి నర్తిస్తాయి.. మనసావాచాకర్మేణా స్వీకరించి అధ్యయనం చేస్తే ఒక్కో పేజీ జీవితాల్నే సుందరనందనాలుగా మార్చేస్తుంది“ అంటూ రచయిత ఘనంగానే చాటారు. త్వరలోనే `మెగాస్టార్ శ్రీ చిరంజీవి జీవిత చరిత్ర` పుస్తకాన్ని ఆవిష్కరించనున్నామని తెలిపారు.

ఎలాంటి గాడ్ ఫాదర్ లేకుండా పరిశ్రమలో స్వయంకృషితో ఎదిగిన నటుడు చిరంజీవి. నేడు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఉన్న స్టారాధిస్టార్. ఆయన లైఫ్ జర్నీ.. కెరీర్ జర్నీ.. సోషల్ వర్క్ ప్రతిదీ అభిమానులకు స్ఫూర్తి. మెగాస్టార్ తర్వాత మళ్లీ అంతటి స్టార్ టాలీవుడ్ లో వేరొకరు పుట్టబోరు అనేది మెగాభిమానుల నమ్మకం. అందుకే ఇప్పుడు చిరంజీవి జీవితంలో తెలియని విషయాల్ని తాజా పుస్తకంలో ఏం తెలియజేస్తారో చదవాలి అన్న ఉత్కంఠ అభిమానుల్లో ఏర్పడింది. ఎన్టీఆర్- దాసరి నారాయణరావు- సావిత్రి వంటి లెజెండ్స్ పై ఇదే రచయిత ఇంతకుముందు పలు పుస్తకాల్ని రచించారు.
Please Read Disclaimer