‘మా’ లో లుకలుకలున్నాయన్న అధ్యక్షుడు

0

మూవీ ఆర్టిస్టుల సంఘం (మా) మాజీ అధ్యక్షుడు.. ప్రస్తుత అధ్యక్షుడి మధ్య విభేధాల గురించి తెలిసిందే. మొన్నటి మా ఎన్నికల హోరాహోరీ .. డర్టీ గేమ్ పరిశ్రమలో హాట్ టాపిక్ అయ్యింది. మాజీ `మా` అధ్యక్షుడు శివాజీ రాజాని నాటకీయ పరిణామాల నేపథ్యం లో ఓడించి అధ్యక్ష పీఠాన్ని సీనియర్ నరేష్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఆ తరువాత నూతన అధ్యక్షుడి గా నరేష్ ప్రమాణ స్వీకారం చేసిన రోజునే కొత్తగా ఎన్నికైన సభ్యుల్లో లుకలుకలు బయటపడ్డాయి. స్టేజీ మీదే హేమ నరేష్ మా గొంతు నొక్కేస్తున్నారని ఓపెన్ గా చెప్పేయడంతో సభ్యులందరి లోనూ కలవరం మొదలైంది. అది రోజు రోజుకూ పెరిగి పెద్ద దై జీవిత- రాజశేఖర్.. సమీర్ వంటి వాళ్లంతా మీడియా ముఖంగా నరేష్ పై సంచలన వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది.

తాజాగా `మా`లో ఏర్పడిన లుకలుకలపై నరేష్ స్పందించి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. `మా`లో ఏర్పడ్డ అంతర్గత విభేదాలపై స్పందించారు. అధ్యక్షుడి గా ఒక్క టర్మ్ మాత్రమే వుంటానని ముందే చెప్పానని.. `మా` అంటే రాజకీయ పార్టీ కాదని. సేవా సంస్థగా భావించాలని చిరంజీవి- కృష్ణంరాజు- మురళీమోహన్ లాంటి పెద్దల సహకారం తో అందరిని కలుపుకుపోతున్నానని స్పష్టం చేశారు నరేష్.

ఇదే సందర్భం గా `మా`లో ఆదిపత్య పోరు.. వివాదాలు వున్న మాట వాస్తవమే అని అంగీకరించిన నరేష్ తన పదవీ కాలం ఏడాది పూర్తయిందని.. అధ్యక్ష పీఠం నుంచి దిగిపొమ్మని ఎవరు కోరినా దిగిపోతానని.. తనని ఎవరు మయటకు పంపించలేరని స్పష్టం చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే మా వనభోజనాలతో ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నారన్న సమాచారం ఉంది. మెగాస్టార్ చిరంజీవి సహా పలువురు సినీ పెద్దలు సమస్యను సామరస్యంగా పరిష్కరించే దిశగా సూచనలు చేస్తున్నారట.
Please Read Disclaimer