సునీల్ వెంట పడుతున్న ఆ ఇద్దరు ఎవరు?

0

కమెడియన్ టర్న్ డ్ హీరో! ఇది వినేందుకు ఎంత గమ్మత్తుగా ఉంటుందో ఒకసారి ఈ మత్తులో పడ్డాక ఏమవుతోందో కూడా ప్రత్యక్షంగా చూస్తున్నదే. హీరో సునీల్ సహా పలువురు కమెడియన్ల పరిస్థితి ఇదే. అయితే వీళ్లంతా అనే మాట ఒక్కటే. నటుడు అవ్వడమే గొప్ప అనుకుంటే హీరో అవ్వడం ఇంకా గొప్ప. వెయ్యి జన్మల పుణ్య ఫలం. బ్యాలెన్స్ లైఫ్ అంతా పూర్వ జన్మ సుకృతం అంటూ వేదాంతం వల్లిస్తూనే ఉన్నారు.

అదంతా సరే.. సునీల్ కంబ్యాక్ ఎప్పుడు? క్యారెక్టర్ ఆర్టిస్టుగా బౌన్స్ బ్యాక్ అయినా ఆశించినది దక్కడం లేదు. ఒకవేళ హీరోగా అవకాశం వస్తే నటిస్తాడా? అంటే ఇంతవరకూ సరైన క్లారిటీనే లేదు. `అందాల రాముడు` సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి.. ఒక్క సినిమాతో హీరో అనే కోరిక తీరిందిలే అనుకుంటే రాజమౌళి `మర్యాదరామన్న`తో మరో బ్లాక్ బస్టర్ ని అందించి సునీల్ కి హీరో వేషాలపై మరింత ప్రేమ పెరిగేలా చేశాడు. దీనికితోడు రామ్ గోపాల్ వర్మ `కథ స్క్రీన్ప్లే దర్శకత్వం అప్పల్రాజు` చిత్రాన్ని తెరపైకి తీసుకొచ్చాడు. తరువాత వచ్చిన `పూల రంగడు` హిట్ కావడంతో సునీల్ పూర్తిగా హీరోయిజంపైనే మనసు పారేసుకున్నాడు. కేవలం హీరో అనే స్థాయికి వెళ్లిపోయాడు.

కారణం ఏదైనా ఈ మత్తులోనే కామెడీ పాత్రలకు దూరమయ్యాడు. హీరో ఇమేజ్ వల్ల క్యారెక్టర్లు చేయడం మధ్యలో కుదరలేదు. ఆ తర్వాతనే అసలు కథ మొదలైంది. హీరోగా సునీల్ చేసిన చిత్రాలన్నీ వరుస ఫ్లాపులు కావడం మొదలైంది. దాంతో హీరోగా చేయడం మానేసి కమెడియన్ గా ప్రయత్నించినా ఫలితం ఉండటం లేదు. స్నేహితుడు త్రివిక్రమ్ `అరవింద సమేత`లో ఛాన్సిచ్చినా .. ఆ తర్వాత ఎలాంటి ఛాన్సుల్లేవ్.

మునుపటి మార్కు మిస్సవ్వడమో.. ఫేడవుట్ అన్న భావన వల్లనో క్రమంగా సునీల్ కు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా అవకాశాలు తగ్గు ముఖం పట్టాయి. ప్రస్తుతం సునీల్ సన్నివేశం ఏమిటి? అంటే ..అతడు నటిస్తానంటే ఒకట్రెండు బడా నిర్మాణ సంస్థలు హీరోగా అవకాశాలిచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయని తెలిసింది. కానీ సునీల్ మాత్రం అందుకు అంగీకరించడం లేదట. మరి తాజా సన్నివేశం చూస్తుంటే సరైన నిర్ణయం తీసుకోవడంలోనే సునీల్ తడబడుతున్నాడా? అన్నది తనే విశ్లేషించుకోవాల్సి ఉంటుంది.
Please Read Disclaimer