కులం కుట్రల దర్శకుడిపైనే కుట్రనా?

0

సంచలనాల రాంగోపాల్ వర్మ శైలి గురించి చెప్పాల్సిన పని లేదు. కొంత కాలంగా మాఫియా- క్రైమ్ కథల్ని పక్కనబెట్టి… జీవిత కథలు.. కులాల మధ్య చిచ్చు పెట్టే కథల్ని ఎంచుకుంటున్నాడు. ఆ మధ్య వంగవీటి మోహనరంగ కథను `వంగవీటి` టైటిల్ తో తెరకెక్కించడంతో ఓ వర్గాన్ని టార్గెట్ చేయడంపై తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. తాజాగా కమ్మ రాజ్యంలో కడపరెడ్లు అంటూ టైటిల్ లోనే ఏకంగా ఆ రెండు అగ్ర కులాల మధ్య వేలు పెట్టాడు. సంచలనమే ఎజెండాగా బరిలోకి దూకాడు. కమ్మల పాలనలోకి రెడ్లు ఎలా వచ్చారు? అనే అంశాన్ని తనదైన శైలిలో వర్తమాన రాజకీయాలకు ఆపాదించి సినిమా చేస్తున్నాడు.

ఇప్పటికే ఆ రెండు వర్గాల్లో ఓ వర్గం వర్మపై గుర్రు గా ఉంది. సినిమా కథ కోసం కులాల్ని లాగడం ఏమిటో! అంటూ కోర్టులు కేసులు అంటూ హడావుడి చేస్తున్నారు. సినిమా రిలీజ్ కాకుండా ఆపాలని ఓ పక్క ఒత్తిళ్లు ఉన్నా వర్మ వాటిని పట్టించుకోకుండా ముందుకెళ్తున్నాడు. ఈ కథ రాజకీయ నాయకులకు సంబంధించిన కథే అయినప్పటికీ భిన్నత్వంలో ఏకత్వం ఉన్న దేశంలో కులాల పేరుతో మంట రేపుతున్నాడని సామాజిక వేత్తలు సైతం మండిపడుతున్నారు. ఆ విషయం పక్కన బెడితే ఈ సినిమా విషయంలో పంపిణీ వర్గాల్లో కమ్మ కులాన్ని ఏకం చేసే పనిలో ఓ షాడో గేమ్ నడుస్తోందని తాజాగా షాకింగ్ ట్రూత్ రివీలైంది. సినిమా ఇండస్ట్రీకి చెందిన ఓ నిర్మాణ సంస్థ అధినేత దీని వెనక ఉండి చక్రం తిప్పుతున్నాడని ఫిలిం సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది.

`కమ్మరాజ్యంలో కడపరెడ్లు` చిత్రానికి థియేటర్లు ఇవ్వకుండా అడ్డుకోవాలని ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు వినిపిస్తోంది. ఓ వర్గం డిస్ట్రిబ్యూటర్లు అందర్నీ ఏకం చేసి సినిమా ఎంత తక్కువగా ప్రజల్లోకి వెళ్తే అంత మంచిదని చురుగ్గా పావులు కదుపుతున్నాడట. వాస్తవానికి వంగవీటి సమయంలోనే సదరు నిర్మాత ఇలాంటి ప్రయత్నం చేశాడు. అప్పటి ఏపీ సీఎం చంద్రబాబుకు అతడు సన్నిహితుడు కావడంతో ఆ సినిమాని ఏపీలో సవ్యంగా రిలీజ్ కానివ్వలేదట. ఇప్పుడు కూడా అదే అగ్ర నిర్మాత కం పంపిణీదారుడు కం ఎగ్జిబిటర్ .. ఇప్పుడు కూడా అలాంటి ప్రయత్నమే చేస్తున్నాడట. కమ్మ రెడ్డి అంటూ ఆర్జీవీ నేరుగా కులాల్ని ప్రస్తావించిన నేపథ్యంలో వదిలేదు అంటూ సీరియస్ గానే ఉన్నాడని సమాచారం. వర్మ సినిమా రిలీజ్ తేదీని ప్రకటిస్తే దీనిపై మరింత అప్ డేట్ తెలిసే అవకాశం ఉంది. ఆ మేరకు తేదేపా సన్నిహిత వర్గాల నుంచి సమాచారం అందింది.




Please Read Disclaimer