వివాదాల సినిమాలు అమెజాన్ లో

0

డిజిటల్ రాకతో వినోదం రూపు రేఖలు మారిపోయాయి. బుల్లి పెట్టెలోనే అన్ని సినిమాలు అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. పైగా సినిమాలు అండర్ ప్రొడక్షన్ ఉండగానే అమెజాన్ నెట్ ఫ్లిక్స్ లాంటి ఆన్ లైన్ స్ట్రీమింగ్ సంస్థలు ముందే డిజిటల్ రిలీజ్ తేదీ లీక్ చేస్తుండడంతో థియేటర్లకు వెళ్లాలనుకున్న ఆడియెన్ కూడా ఆ తేదీల కోసమే వేచి చూస్తున్నారు. అలా ఇటీవల రిలీజైన పలు సినిమాలకు కలెక్షన్ల పరంగా ఆ మేరకు పంచ్ పడిందన్న విశ్లేషణ సాగుతోంది. హిట్టయిన సినిమా వరకూ సేఫ్ అవుతోంది కానీ – ఫట్ అన్న టాక్ వినిపిస్తే మాత్రం డిజిటల్ రిలీజ్ కోసం వేచి చూస్తున్నారు. మరో నెలరోజులు వేచి చూస్తే డిజిటల్ లోనే ఆ సినిమాల్ని చూసేయొచ్చు అన్న భావన యువతరంలో ప్రముఖంగా కనిపిస్తోంది. బిటెక్ లు చదివేవాళ్లే కాదు.. కామన్ డిగ్రీలు చేసేవాళ్లు డిజిటల్ పై అవగాహనతో ముందుకు వెళుతున్నారు. అరచేతిలో మొబైల్ ఉన్న రైతన్న – గృహిణులు కూడా డిజిటల్ వీక్షణకు అలవాటు పడుతున్న రోజులివి. అలా డిజిటల్ లో వీక్షించేందుకు అర్హమైన సినిమాలు మరో రెండు తాజాగా అందుబాటులోకి వచ్చాయి.

సంక్రాంతి బరిలో రిలీజైన నాలుగు సినిమాలు ఇప్పటికే డిజిటల్ లో అందుబాటులో ఉన్నాయి. వినయ విధేయ రామ – పేట – కథానాయకుడు (ఎన్టీఆర్ బయోపిక్ పార్ట్ 1) – ఎఫ్ 2 చిత్రాలు డిజిటల్ స్ట్రీమింగ్ లో అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు వీటితో పాటు `మహానాయకుడు` (ఎన్టీఆర్ బయోపిక్ పార్ట్ 2) – `మణికర్ణిక: ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ` చిత్రాలు తాజాగా అమెజాన్ లో అందుబాటులోకి వచ్చేశాయి. ఈ రెండు సినిమాలు రిలీజ్ ముంగిట బోలెడన్ని వివాదాల్ని మోసుకొచ్చిన సంగతి తెలిసిందే. వివాదాలతో ప్రచారం కొట్టేసినా తెలుగు రాష్ట్రాల్లో ఈ రెండు సినిమాలకు ఆదరణ దక్కలేదు. అందుకే ఇప్పుడు వీటికి ఈ ఇరు రాష్ట్రాల్లో డిజిటల్ వీక్షణ బావుంటుందని అంచనా వేస్తున్నారు.

ఎన్బీకే `మహానాయకుడు` చూసేందుకు థియేటర్లకు వెళ్లని జనం.. ఇప్పుడు అమెజాన్ లో వీక్షిస్తారు అన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. `కథానాయకుడు + మహానాయకుడు` టోకున అమెజాన్ లో ఫ్రీగా వీక్షించే వెసులుబాటు ఉంది కాబట్టి ఆ మేరకు ఫ్రీ ఆఫర్ కోసం యాప్ లు డౌన్ లోడ్ చేసుకుని చూసేవాళ్లు ఉంటారని విశ్లేషిస్తున్నారు. ఇక వీరనారి ఝాన్సీ లక్ష్మీ భాయ్ జీవితకథతో తెరకెక్కిన `మణికర్ణిక` హిందీ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. ప్రాంతీయ భాషల్లోనూ ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. అందుకే ఈ సినిమాకి డిజిటల్ లో ప్రాంతీయంగానూ ఆదరణ బావుంటుందని అంచనా వేస్తున్నారు. మొత్తానికి డిజిటల్ ప్రభావం నెమ్మదిగా చాప కింద నీరులా పాకిపోతోందనడానికి ఇంతకంటే ఎగ్జాంపుల్ అవసరం లేదు.
Please Read Disclaimer