వివాదంతో మల్లేశంకు మస్త్ పబ్లిసిటీ

0

చేనేత కార్మికుల కష్టాలను తగ్గించే ఆసు యంత్రాన్ని కనిపెట్టిన చింతకింది మల్లేశంకు కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డు ఇచ్చి గౌరవిస్తే.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కోటి రూపాయల ఆర్ధిక సాయం చేసి చేనేత పరిశ్రమ అభివృద్దికి మల్లేశం కృషి చేయాల్సిందిగా కోరింది. చింతకింది మల్లేశం ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఫేమస్ అయ్యాడు. అలాంటి చింతకింది మల్లేశం బయోపిక్ ను ‘మల్లేశం’ అనే టైటిల్ తో తెరకెక్కించడం జరిగింది. ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి రాజ్ ఆర్ దర్శకత్వం వహించాడు.

విడుదలకు తేదీ సమీపిస్తున్న సమయంలో ప్రస్తుతం మల్లేశం విషయంలో వివాదం రాజుకుంది. మల్లేశం తయారు చేసినట్లుగా చెబుతున్న ఆసు యంత్రాన్ని తాము అంతకు ముందే తయారు చేశామని.. కాని మేము దాన్ని మార్కెటింగ్ చేసుకోవడంలో విఫలం అయ్యామంటూ ఎలుగొందుల సత్యనారాయణ మరియు ఆయన తమ్ముడు ఎలుగొందుల శ్రీనివాస్ లు మీడియా ముందుకు వచ్చారు. చాలా రోజులుగా వీరు ఆసు యంత్రానికి సంబంధించిన విషయమై పోరాటం చేస్తున్నారు.

ప్రస్తుతం ‘మల్లేశం’ సినిమా విడుదల ఉన్న కారణంగా శ్రీనివాస్ మరియు సత్య నారాయణలు తమ వాదనకు పదును పెట్టారు. అన్ని మీడియా సంస్థలకు వెళ్లి మరీ తాము కనిపెట్టామని చెబుతున్నారు. దాంతో మల్లేశం సినిమాకు భారీగా పబ్లిసిటీ దక్కుతుంది. అసలు ఆసు యంత్రం అంటే ఏంటీ.. దాన్ని ఎందుకు తయారు చేశారు అనే విషయాలను తెలుసుకోవాలనే ఆసక్తి జనాల్లో కలుగుతుంది. దాంతో సినిమాకు ఖచ్చితంగా భారీ ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉందనిపిస్తుంది.
Please Read Disclaimer