మహేష్.. ఎందుకు ఈ పక్షపాతం?

0

విజయ్ హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో తమిళంలో తెరకెక్కిన ‘సర్కార్’ చిత్రం తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగులో కూడా విడుదలైన ఈ చిత్రం యావరేజ్ టాక్ ను దక్కించుకుంది. అంచనాలను అందుకోలేక పోయిందని విశ్లేషకులు మరియు ప్రేక్షకులు అంటున్నారు. అయితే మహేష్ బాబు మాత్రం సినిమా బాగుందని – మురుగదాస్ బ్రాండ్ మార్క్ లో ఉందని – సినిమా ఆద్యంతం ఎంజాయ్ చేశాను అంటూ ట్వీట్ చేశాడు. మహేష్ ట్వీట్ తో తెలుగులో ఈ చిత్రంకు మంచి వసూళ్లు వస్తున్నాయనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. మురుగదాస్ తో ఉన్న సన్నిహిత్యం – స్నేహం కారణంగా మహేష్ ఈ ట్వీట్ చేశాడు అనేది అందరికి తెలిసిన విషయమే.

‘సర్కార్’ చిత్రంపై మహేష్ చేసిన ట్వీట్ ప్రస్తుతం ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు కోపం తెప్పిస్తోంది. ఈమద్య కాలంలో తెలుగు సినిమా పరిశ్రమలోని పెద్ద హీరోలు చాలా స్నేహంగా ఉంటున్నారు. మహేష్ – ఎన్టీఆర్ – చరణ్ లు ఈమద్య తరచు కలవడం చూస్తూనే ఉన్నాం. మహేష్ సినిమా వేడుకలో ఎన్టీఆర్ కనిపించడం – సినిమా గురించి పాజిటివ్ రియాక్షన్ ఇవ్వడం మనం చూశాం. దాంతో తాజాగా ఎన్టీఆర్ సినిమా ‘అరవింద సమేత’ కు మహేష్ నుండి ఫ్యాన్స్ పాజిటివ్ రియాక్షన్ కోరుకున్నారు.

కాని మహేష్ బాబు బిజీగా ఉండటం వల్లో లేదా మరే కారణంగానో అరవింద సమేత చిత్రం గురించి స్పందించలేదు. అరవింద సమేత చిత్రం గురించి పలువురు స్పందించారు. కాని మహేష్ బాబు స్పందించక పోవడంతో అప్పుడే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు ఫ్యాన్స్ మహేష్ ను రిక్వెస్ట్ చేశారు. మహేష్ నుండి ఎలాంటి స్పందన దక్కలేదు.

ఇప్పుడు మాత్రం సర్కార్ చిత్రం గురించి స్పందించడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డబ్బింగ్ సినిమా అది కూడా యావరేజ్ గా ఉన్న సినిమా గురించి మహేష్ స్పందించాడు కాని తన మిత్రుడు అయిన ఎన్టీఆర్ నటించింది మరో మిత్రుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అరవింద సమేత చిత్రాన్ని మాత్రం మహేష్ పట్టించుకోలేదని సోషల్ మీడియాలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ దుమ్మెత్తి పోస్తున్నారు.

మహేష్ ట్వీట్ పై ప్రస్తుతం జరుగుతున్న రగడ అర్థ రహితం అని – ఆయన ఇష్టం మేరకు ఆయన ట్వీట్స్ చేసుకుంటాడు. అంతే కాని ఇలా టార్గెట్ చేయడం ఏంటీ అంటూ మహేష్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

గతంలో రాజమౌళి విషయంలో కూడా ఇదే జరిగింది. చిన్న సినిమాలకు స్పందించి – కొన్ని పెద్ద సినిమాలపై స్పందించక పోవడంతో ఆయనపై విమర్శలు వ్యక్తం అయ్యాయి. దాంతో చిన్నా – పెద్దా ఏ సినిమాల గురించి ఈమద్య జక్కన్న స్పందించడం లేదు. ఈ దెబ్బతో మహేష్ కూడా ఇతర సినిమాల గురించి స్పందించక పోవచ్చేమో..!
Please Read Disclaimer