టాలీవుడ్ కోఆర్డినేటర్ వ్యవస్థ రద్దు?

0

టాలీవుడ్ లో దళారీ వ్యవస్థలపై చాలా కాలంగా 24 క్రాప్ట్స్ యూనియన్ ఆఫీసుల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. అన్ని పరిశ్రమల్లో ఉన్నట్టే తెలుగు సినీపరిశ్రమను దళారీలు పీక్కు తింటున్నారన్న ఆవేదన వ్యక్తమవుతోంది. అవకాశం పేరుతో వలలు వేసి ఎన్నో ఆరాచకాలకు పాల్పడుతున్నారనేందుకు ప్రూఫ్ లు చూపిస్తున్నారు కొన్నిసార్లు. కొందరు దళారీలు ఆర్టిస్టుల నుంచి 60-70 శాతం కమీషన్ నొక్కేయడంపై ఇంతకుముందు పలువురు ఆర్టిస్టులు తీవ్ర మనోవేదనకు గురవ్వడం బయటపడింది. కొందరు దుర్మార్గపు కోఆర్డినేటర్లు అయితే కంపెనీలు ఇచ్చిన పారితోషికం నొక్కేసి తమకు ఇవ్వలేదని మొత్తం ఎగ్గొట్టేయడంపైనా మూవీ టీవీ ఆర్టిస్టుల సంఘంలో చర్చ సాగింది.

మూవీ ఆర్టిస్టుల సంఘం (మా) పరిధిలో ఈ సమస్య అంత తీవ్రంగా లేనప్పటికీ.. ఇతర ఆర్టిస్టుల సంఘాల్లో దీనిపై విస్త్రతంగా ఫిర్యాదులు అందడం వేడెక్కిస్తోంది. తాజాగా తెలంగాణ మూవీ అండ్ టీవీ ఆర్టిస్టుల(టీఎంటీఏయు) సంఘానికి ఈ తరహా ఫిర్యాదుల పరంపర సాగుతుండడంపై చర్చ సాగుతోంది.

తాజా సన్నివేశంపై రివ్యూలు చేసిన టీఎంటీఏయూ సంఘం ఇకపై కోఆర్డినేటర్ వ్యవస్థను రద్దు చేస్తున్నామని ప్రకటించింది. కోఆర్డినేటర్లు పిలిచినా వారితో షూటింగులకు వెళ్లొద్దని ఆర్డర్ వేయడం సంచలనమైంది. పృథ్వీరాజ్ అలియాస్ 30 ఇయర్స్ పృథ్వీ అధ్యక్షుడిగా ఉన్న టీఎంటీఏయూ ఈ నిర్ణయం తీసుకోవడంపై ఆర్టిస్టుల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. ఇంతకుముందు ఎన్నికల సందర్భంగా పృథ్వీ తాను ఇచ్చిన హామీని నెరవేరుస్తూ కోఆర్డినేటర్ల వ్యవస్థ రద్దును ప్రకటించారు.

టీఎంటీఏయు ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ.. కోఆర్డినేటర్ల గుట్టును తాజాగా బయటపెట్టడం వేడెక్కిస్తోంది. “కోఆర్డినేటర్లు పిలిస్తే మన సంఘం ఆర్టిస్టులు షూటింగులకు వెళుతున్నారు. అయితే కోఆర్డినేటర్లు ఆర్టిస్టుకు డబ్బులు చెల్లించకుండా ఆపుతున్నారు. కోఆర్డినేటర్ వ్యవస్థను రద్దు చేయాలని అనుకుంటుంటే మీరు ఎందుకు వెళుతున్నారు? కంపెనీ ఆర్టిస్టులు కంపెనీ ఆర్టిస్టులుగా మాత్రమే ఉండాలి. కంపెనీల నుంచి డైరెక్టుగా పారితోషికాలు తీసుకోవాలి. కోఆర్డినేటర్లు కంపెనీలే డబ్బులు ఇవ్వడం లేదు అంటూ నెపం వేసేస్తున్నారు. కంపెనీలు ఇవ్వకపోవడం వల్లనే మేం ఇవ్వడం లేదు అనేస్తున్నారు. కంపెనీలు నిజంగానే ఇవ్వకపోతే యూనియన్ తరపున సమస్యను పరిష్కరించుకోగలం. యాక్షన్ తీసుకోగలం. కానీ అలా జరగకుండా కోఆర్డినేటర్ల ద్వారా ఆర్టిస్టులు షూటింగులకు వెళుతున్నారు. ఇది ఆర్టిస్టుల తప్పే. యూనియన్ సభ్యులు ఎవరూ కోఆర్డినేటర్ పిలిస్తే వెళ్లొద్దు. ప్రమాదాలు జరిగినా.. పారితోషికం ఎగ్గొట్టినా యూనియన్ కి సంబంధం ఉండదు. కోఆర్డినేటర్ తో వెళితే కంపెనీలు బాధ్యత వహించవు“ అని వెల్లడించారు. మెజారిటీ భాగం కంపెనీలు ఆర్టిస్టును మోసం చేయవు. చేయడం లేదు. మధ్యలో కోఆర్డినేటర్లే మోసం చేస్తున్నారని దాదాపు 900 మంది సభ్యులున్న టీఎంటీఏయూ ప్రకటించడం ఆసక్తిని రేకెత్తిస్తోంది.

కోఆర్డినేటర్లకు ఆర్టిస్టులు లోకువయ్యారు. “మేం పిలిచాం. భత్యం ఇచ్చే వరకూ ఎదురు చూడాలి!“ అనే ధోరణి కోఆర్డినేటర్లలో బలంగా ఉంది. ఇక కోఆర్డినేటర్ ద్వారా ఎవరైనా ఆర్టిస్టు లొకేషన్ కి వెళితే వారి బాధ్యత ఎవరూ చూడరు. అటు కంపెనీ బాధ్యత వహించదు. ఇటు టీఎంటీఏయూ బాధ్యత వహించదు.. అని క్లియర్ కట్ గా ప్రకటించడం వందలాది ఆర్టిస్టుల్లో హాట్ టాపిక్ గా మారింది. టీఎంటీఏయు తరహాలోనే మూవీ ఆర్టిస్టుల సంఘం(మా) సైతం ప్రమాదకర కోఆర్డినేటర్ల వ్యవస్థపై గురి పెడుతుందన్న చర్చా తాజాగా మొదలైంది.
Please Read Disclaimer