కరోనా టెస్టుకు కొత్త రూల్స్ వచ్చేశాయ్

0

రోగం వస్తే దాచుకోకూడదని చెబుతారు. అదేం దరిద్రమో కానీ.. కరోనా లాంటి ప్రమాదకర జబ్బు సోకిందా? లేదా? అన్న విషయాన్ని తేల్చుకునేందుకు నిర్దారణ పరీక్షలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటి టెస్టుల సందర్భంగా తీసుకునే ఫోన్ నెంబరును పలువురు తప్పుగా ఇస్తున్నారు. దీనికి కారణం.. పాజిటివ్ అయితే.. తాము కోరుకున్నట్లుగా వైద్యం చేయించుకోవాలనుకోవటం ఒకటైతే.. తమకు తప్ప పాజిటివ్ విషయం మరెవరికీ తెలీకూడదన్నట్లుగా వ్యవహరించటం ఈ మధ్యన ఎక్కువ అవుతుంది.

పాజిటివ్ వచ్చిందన్న విషయం ప్రభుత్వానికి తెలిసినంతనే.. మున్సిపల్ అధికారులతో పాటు ఆరోగ్య.. పోలీసులకు సమాచారం వెళుతుంది. అలాంటి పరిస్థితి లేకుండా ఉండేందుకు తప్పుడు ఫోన్ నెంబర్లు ఇస్తున్నారు. దీంతో పాజిటివ్ గా తేలిన వారిని గుర్తించటంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

ఇలాంటి వాటికి చెక్ పెట్టేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు సరికొత్త విధానాల్ని తెర మీదకు తీసుకొచ్చింది. కొవిడ్ పరీక్ష కేంద్రానికి వెళ్లినంతనే.. అక్కడ ఒక అప్లికేషన్ ఇస్తారు. అందులో పేరు.. ఇంటి అడ్రస్.. ఆధార్ నెంబరుతో పాటు మొబైల్ నెంబరును పేర్కొనాల్సి ఉంటుంది. ఆన్ లైన్ లో రిజిష్టర్ చేసుకున్నంతనే.. సదరు మొబైల్ కు ఓటీపీ (వన్ టైం పాస్ వర్డ్) వస్తుంది. దాని నెంబరు చెబితేనే టెస్టు చేస్తారు. దీంతో.. తప్పుడు ఫోన్ నెంబరు ఇస్తే.. అడ్డంగా బుక్ అయిపోవటం ఖాయం.

ఎందుకంటే.. ఓటీపీ చెప్పకుంటే పరీక్ష చేసే అవకాశం ఉండదు. ఇక.. ఫలితం వచ్చిన తర్వాత కూడా ఆన్ లైన్ లోనే సమాచారాన్నిఅప్పటికప్పుడు నమోదు చేస్తారు. దీంతో.. నెగిటివ్ అయితే నెగిటివ్.. పాజిటివ్ అయితే పాజిటివ్ అని తేలిపోతుంది. దీని ఆధారంగా చర్యలు తీసుకుంటారు. యాంటీజెన్ అయితే 20 నుంచి 40నిమిషాల్లో ఫలితం వచ్చేస్తోంది. అదే సమయంలో ఆర్టీ పీసీఆర్ పరీక్ష ఫలితాన్ని ఇరవైనాలుగు గంటల్లో ఇస్తున్నారు. ఇవన్నీ ఆన్ లైన్ లో ఫోన్ కే సమాచారం నేరుగా రావటం వల్ల.. చికిత్స ఏదైనా చేయించుకోవటానికి ఆసుపత్రికి వెళితే.. వైద్యం సులువుగా అయ్యే అవకాశంతో పాటు..పేషెంట్ వివరాలు పక్కాగా ప్రభుత్వం వద్ద ఉండేలా కొత్త సాఫ్ట్ వేర్ రూపొందించారు.