కరోనా పంచ్: సూపర్ హీరోలు ఢమాల్

0

ప్రపంచాన్ని పట్టి కుదిపేస్తోంది కరోనా వైరస్. ఇటీవల కాలంలో అంతగా భయపెట్టిన పెను ముప్పు ఇంకేదీ లేదు. దాదాపు అన్ని దేశాలు హై ఎలెర్ట్ ప్రకటించాయి. మహమ్మారీ నుంచి బయటపడేందుకు తగిన కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. ఇతర దేశస్థులను.. ముఖ్యంగా చైనా దేశీయుల్ని.. అక్కడే సెటిలైన తమ వారిని కూడా దేశంలోకి రానివ్వకుండా చర్యలు తీసుకుంటున్నారు. ప్రజల్లో విస్త్రతంగా అవగాహన కల్పిస్తున్నారు. అలాగే భారత ప్రభుత్వం కూడా తగిన చర్యలు చేపడుతుంది. ఇటు తెలుగు రాష్ట్రాలు అలెర్టుగానే ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం హీరో విజయ్ దేవరకొండతో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఓ ప్రత్యేక వీడియో చేయించారు. సెలబ్రిటీలంతా అవగాహన పెంచే పనులు చేపట్టారు. అయినా ఈ వ్యాధి బారిన పడిన వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. మృతుల సంఖ్య కూడా పెరుగడం భయపెట్టేస్తోంది.

ఇక కరోనా పంచ్ సినీ పరిశ్రమలపైనా దారుణంగా పడింది. ఇప్పటికే కేరళ సినీ పరిశ్రమ పెద్దలు థియేటర్ల బంద్ కి పిలుపునిచ్చారు. ఈ నెల 31వరకు థియేటర్లు బంద్ చేయాలని నిర్ణయించారు. అలాగే చాలా సినిమాల షూటింగ్లు ఆగిపోయాయి. కమల్ హాసన్ నటిస్తున్న `భారతీయుడు 2` కూడా ఫారెన్ షెడ్యూల్ ని వాయిదా వేసుకుంది. పలు తెలుగు సినిమాల షూటింగ్లు కూడా ఆగిపోయినట్టు తెలుస్తుంది.

మరోవైపు హాలీవుడ్లో ప్రముఖ ప్రొడక్షన్ కంపెనీ మార్వెల్ స్టూడియో అనేక సూపర్ హీరో చిత్రాలను రూపొందిస్తుంది. అలాగే వెబ్ సిరీస్లను తెరకెక్కిస్తూ బిజీగా ఉంటుంది. అందులో భాగంగా సెబాస్టియన్ స్టాన్… ఆంటోని మ్యాకీ హీరోలుగా తాము తీస్తున్న `ది ఫాల్కన్ అండ్ ది వింటర్ సోల్జర్` అనే సూపర్ హీరో వెబ్ సిరీస్ షూటింగ్ని కరోనా వైరస్ కారణంగా రద్దు చేసుకుంది. ప్రాగ్ లో జరపాల్సిన షూటింగ్ని రద్దు చేస్తున్నట్టు నిర్మాణసంస్థ అధికారికంగా ప్రకటించింది. షూటింగ్ లకు సంబంధించి అన్నిరకాల రక్షణ చర్యలు తీసుకునే కెపాసిటీ ఉన్నప్రపంచం లోనే అత్యంత పెద్దదైన ప్రొడక్షన్ కంపెనీనే ఇలాంటి నిర్ణయం తీసుకోవడం షాక్ కి గురిచేస్తుంది. మరి చిన్న ప్రొడక్షన్ల పరిస్థితి ఏంటనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

మరోవైపు కరోనా వల్లనే ‘జేమ్స్ బాండ్’ చిత్రం `నో టైమ్ టు డై`ని వాయిదా వేసుకున్నారు. ఏప్రిల్ లో విడుదల కావాల్సిన ఈ చిత్రాన్ని ఇండియాలో నవంబర్ లో విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. అమెరికాలో కూడా రిలీజ్ డేట్ పై ఇంకా క్లారిటీ లేదు. మొత్తానికి కరోనా వైరస్ అన్ని రకాల వ్యాపారాలను దెబ్బ తీస్తుందని చెప్పడం లో అతిశయోక్తి లేదు. ఇది కేవలం జేమ్స్ బాండ్ 007 కి మాత్రమే కాదు.. ప్రతిష్ఠాత్మక మార్వల్ సూపర్ హీరో సినిమాలకు పెద్ద పంచ్ వేసిందని విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఈ సమ్మర్ లో రిలీజ్ కి రాబోతున్న పలు హాలీవుడ్ సినిమాల రిలీజ్ వాయిదాలకు కరోనా కారణమవుతోంది. ఈ మహా ఉత్పాతం వల్ల వందల కోట్ల నష్టం తప్పదన్న అంచనా వెలువడింది.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-