సూపర్ స్టార్ పై కోవిడ్ నిబంధనల ఉల్లంఘన కేసు

0

బాలీవుడ్ సూపర్ స్టార్.. మిస్టర్ పెర్ఫెక్ట్ అమీర్ ఖాన్ పై యూపీ ఎమ్మెల్యే పోలీసులకు స్థానిక ఎమ్మెల్యే నంద కిషోర్ గుర్జార్ ఫిర్యాదు చేయడం చర్చనీయాంశం అయ్యింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా దశల వారిగా లాక్ డౌన్ ను సఢలిస్తూ వస్తున్నప్పటికి ప్రతి ఒక్కరు కూడా సామాజిక దూరం పాటిస్తూ మాస్క్ ను తప్పనిసరిగా ధరించాలంటూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

మాస్క్ లేకుండా బహిరంగ ప్రదేశాల్లో కనిపిస్తే జరిమానాతో పాటు శిక్ష కూడా విధిస్తున్నారు. అలాగే సామాజిక దూరం పాటించకుండా కార్యక్రమాలు నిర్వహించిన వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామంటూ ప్రభుత్వం హెచ్చరించింది. అయినా కూడా ఈ నిబంధనలు చాలా మంది పాటించడం లేదు. సామాన్యులకు మాస్క్ మరియు సామాజిక దూరం విషయాల్లో అవగాహణ కల్పించాల్సిన స్టార్స్ కూడా వాటిని పాటించకుండా బాధ్యతా రాహిత్యంగా వ్యవహరిస్తున్నారు అనేది ఎమ్మెల్యే నంద కిషోర్ ఆరోపణ.

ఇటీవల ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ లోని ట్రోనికా లో అమీర్ ఖాన్ షూటింగ్ లో పాల్గొన్నాడు. ఆ సందర్బంగా స్థానికులు ఆయన్ను చూసేందుకు పెద్ద ఎత్తున వచ్చారు. దాంతో వారిని నిరాశ పర్చకుండా అమీర్ ఖాన్ వారితో ఫొటో దిగేందుకు ఓకే చెప్పాడు. ఆ సమయంలో ఏ ఒక్కరికి మాస్క్ లేదు. ముఖ్యంగా అమీర్ ఖాన్ మాస్క్ పెట్టుకోలేదు. పైగా సామాజిక దూరం అనేదే కనిపించలేదు.

ఈ కారణాల వల్ల అమీర్ ఖాన్ పై కోవిడ్ నిబంధనల ఉల్లంఘనపై కేసు నమోదు చేయాల్సిందే అంటూ యూపీ పోలీసులకు ఎమ్మెల్యే నంద కిషోర్ ఫిర్యాదు చేశాడు. ఎమ్మెల్యే ఫిర్యాదు మేరకు అమీర్ ఖాన్ తో పాటు సినిమా యూనిట్ సభ్యులపై కేసు నమోదు చేసేందుకు పోలీసులు సిద్దం అయ్యారు. ఈ విషయమై అమీర్ ఖాన్ ఎలా స్పందిస్తాడు అనేది చూడాలి.