కరోనాను ఇలా కూడా వాడొచ్చా అల్లరి బాబూ!

0

అల్లరి రవిబాబు వరుస ఫ్లాపుల రికార్డ్ గురించి తెలిసిందే. ట్యాలెంట్ ఉన్నా ఎందుకనో బాక్సాఫీస్ వద్ద రాణించలేకపోతున్నారు. ఆయన ఈసారైనా గాడిలో పడతారా? మళ్లీ తనదైన మార్కు ఎంటర్ టైనర్ తో
అలరించబోతున్నాడా? రొటీన్ కి భిన్నంగా కొత్త పంథాతో మెప్పిస్తాడా? ఇలా ఎన్నో ప్రశ్నలు అభిమానులకు ఎదురవుతున్నాయి. వీటన్నింటికీ అతడు ప్రాక్టికల్ గానే సమాధానం చెప్పాల్సి ఉంటుంది. తాజాగా రవిబాబు రూపొందిన చిత్రం క్రష్. ఈ సినిమా పోస్టర్లను ఒక్కొక్కటిగా విడుదల చేస్తున్న రవిబాబు కుర్రకారు గుండెల్లో గుబులు రేపే ప్రయత్నం చేస్తున్నాడు.

కొద్ది రోజుల క్రితం బికినీ భామ ఫొటోను రిలీజ్ చేసి ..ఈ చిత్రంలో రొమాంటిక్ యాంగిల్ ఏ స్థాయిలో ఉండబోతోందో చెప్పాడు. ఈ వాల్ పోస్టర్ చూసిన యూత్ కంటికి కునుకు పట్టని పరిస్థితిలో ఏదో అయిపోయారు. రవిబాబు పూర్తిగా అతివల అందాలను నమ్ముకుని ఇలాంటి ప్రయోగాలు చేస్తున్నాడా? అంటూ సందేహం వ్యక్తం చేశారు. ఆ బికినీని మరిచే లోపే.. క్రష్ మూవీ నుంచి మరో కొత్త పోస్టర్ దూసుకొచ్చింది. ఈ పోస్టర్ చూసిన ఎవరైనా ఒక్కసారిగా షాక్ కు గురవ్వాల్సిందే.

టైమింగ్ చూసి టెంప్టింగ్ పోస్టర్లతో ప్రచారం కానిచ్చేయడంలో ఎంతైనా రవిబాబు తెలివి తేటలు అమోఘం అంటూ ప్రశంసించాల్సిందే. ప్రస్తుతం ప్రపంచ దేశాలను వణికిస్తున్న వైరస్ భూతం కరోనా ఇప్పుడు భారతదేశాన్నీ కుదిపేస్తోంది. తాజాగా తెలంగాణలోనూ ఇలాంటి కేసు నమోదవడం మరింత కంగారు పెడుతోంది. అయితే రవిబాబు కొత్త చిత్రం వాల్ పోస్టర్లో కరోనా కాన్సెప్టును సైతం తెలివిగా ఉపయోగించేశాడు. నాయకానాయికలు ముఖానికి మాస్క్ లు ధరించి లిప్ లాక్ వేస్తున్నారు. ఈ పోస్టర్ ప్రస్తుతానికి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. కరోనాపై అవగాహన కలిగిస్తుండటంతో పాటు తెలివిగా ప్రచారం సాగిపోతోంది. హీటెక్కిస్తున్న ఈ పోస్టర్ కొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తుందని రవిబాబు అభిమానులు అంటున్నారు.

కొద్ది సంవత్సరాలుగా రవిబాబు తీసిన చిత్రాలు బ్యాక్ టు బ్యాక్ బోల్తా కొడుతున్నాయి. అదిగో- ఆవిరి చిత్రాలు ఎలాంటి కొత్తదనం లేకుండా పరమ రొటీన్ గా ఉండటంతో ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లకుండా ముఖం చాటేశారు. ఇలా బ్యాడ్ టైమ్ నడుస్తుండటంతో రవిబాబు గ్యాప్ తీసుకున్నాడు. ఇప్పుడు కామెడీ రొమాంటిక్ మోడ్ లోకి మారి.. సత్తా చూపించబోతున్నాడా అన్నది చూడాలి. తాజాగా క్రష్ పోస్టర్ ను చూసిన వారు మాత్రం పబ్లిసిటీలో సంచలనాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మను రవిబాబు కూడా అనుసరిస్తున్నాడని వ్యాఖ్యానిస్తున్నారు. అయితే క్రష్ మెప్పిస్తుందో.. లేదా అన్నది కొద్దిరోజులు వెయిట్ చేస్తే కానీ తెలీదు.
Please Read Disclaimer