భార్య ముందే ఆ డైరెక్టర్ చెంప ఛెళ్లుమంది!

0

కొద్ది నెలల ముందు హాలీవుడ్ లో పెద్ద రచ్చ జరిగిన మీటూ.. నెమ్మది నెమ్మదిగా బాలీవుడ్ కు ఆ తర్వాత దేశంలోని ఇతర వుడ్లకు చేరుకుంది. ఇటీవల కాలంలో వాళ్లు.. వీళ్లు అన్న తేడా లేకుండా పలు రంగాలకు చెందిన మహిళలు ధైర్యంతో తమకు ఎదురైన లైంగిక వేధింపులపై గళం విప్పితున్నారు. తనుశ్రీ దత్తా మొదలు.. పలువురు నటీమణులు తమకు ఎదురైన చేదు అనుభవాల్ని సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు.

తాజాగా అలాంటి సంచలనం ఒకటి తెర మీదకు వచ్చింది. బాలీవుడ్ లో కాస్త భిన్నమైన సినిమాలు తీస్తారన్న పేరున్న దర్శకుడు సుభాష్ కపూర్ కక్కుర్తి బుద్ధిని వీడియో సాక్ష్యంగా బయటపెట్టింది నటి గీతికా త్యాగి. జాలీ ఎల్ ఎల్ బీ దర్శకుడు సుభాష్ కపూర్ తనను లైంగికంగా వేధింపులకు గురి చేసినట్లుగా ఆమె పేర్కొన్నారు.

తాజాగా ఆమె వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ప్రతిభ ఉన్న దర్శకుడిగా సుభాష్ కు పేరుంది. ఒక చేయి లేనప్పటికీ టాలెంట్ తో ఉన్నత స్థానానికి చేరుకున్న ఆయన్ను పలువురు గొప్పగా చూపిస్తుంటారు. పేరు ప్రఖ్యాతలకు కొదవ లేకున్నా.. అతగాడి కక్కుర్తి ఎలాంటిదో సాక్ష్యంతో సహా సోషల్ మీడియాలో పెట్టేసింది నటి గీతిక.

సుభాష్ నిజస్వరూపం ఇది అంటూ ఆయనకు సంబంధించిన ఒక వీడియోను ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. దర్వకుడు సుభాష్ ఎలాంటివాడో చెప్పేందుకు.. అతడి నిజ స్వరూపాన్ని బయటపెట్టేందుకు అతగాడికి సంబంధించిన ఒక వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

దాదాపు ఐదు నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోలో.. దర్శకుడు సుభాష్ తో పాటు.. అతని సతీమణి మధ్య వాగ్యుద్ధం జరిగినట్లుగా చెప్పే వీడియో బయటకు వచ్చింది. ఇది కాకుండా.. దర్శకుడి చెంప ఛెళ్లుమనిపించిన దృశ్యాలు బయటకు వచ్చాయి. వాస్తవానికి ఆమె మొత్తం వీడియోను తీసుకున్నప్పటికి దర్శకుడి చెంప ఛెళ్లుమనిపించిన దృశ్యాన్ని మాత్రం ఆమె తొలగించినట్లుగా తెలుస్తోంది. అయితే.. వారున్న చోట సీసీ కెమేరా ఉండటంతో దర్శకుడికి చెంప ఛెళ్లుమన్న దృశ్యం అక్కడి నుంచి లీకైనట్లుగా తెలుస్తోంది. తన తప్పు ఏమీ లేదన్న సంజాయిసీని భార్యకు ఇస్తున్న వైనం కనిపించింది. ఈ సందర్భంగా భార్య భావోద్వేగానికి గురైనట్లుగా కనిపించక మానదు. ఒక పేరున్న దర్శకుడు నటిని లైంగిక వేధింపులకు సంబంధించిన సమాచారాన్ని సోషల్ మీడియాలో పెట్టటం కామనే అయినా.. ఆయన భార్యకే నేరుగా చెప్పటం.. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయటం సంచలనంగా మారింది. ఇదిలా ఉంటే తాజాగా సుభాష్ కపూర్ దర్శకత్వం వహిస్తున్న మొఘల్ మూవీ నుంచి బాలీవుడ్ ప్రముఖ నటుడు అమిర్ ఖాన్ తప్పుకున్నారు. గతంలోనే ఈ వీడియోను చూసిన ఆయన ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Please Read Disclaimer