బూతు బూతశ్య.. ఇదేం టీజర్ బాబోయ్!

0

తెలుగు సినిమా ఖండాంతరాల్లో విస్తరిస్తూ మన ఖ్యాతిని పెంచుతుంటే.. నాశిరకం సినిమాలు ఆ పేరును కాస్తా చెడగొట్టేస్తున్నాయి. తెలుగు సినిమా రిచ్ కంటెంట్ కి కేరాఫ్ అడ్రస్ అన్న ప్రశంసలు దక్కుతున్న ఈ రోజుల్లో కూడా.. కొందరు మన పరిశ్రమను బూతు పురాణంతో షంటేయడం భయపెట్టేస్తోంది. అందుకు ఇదిగో ఈ టీజర్ పరాకాష్ట. ఆదిత్య ఓం- రేఖ బోజ్ జంటగా నటించిన తాజా చిత్రం `దామిని బంగ్లా`. రాకేష్ రెడ్డి రూపొందించిన ఈ చిత్ర టీజర్ సర్వం బూతు మయం. కథానాయకుడు ఆదిత్య ఓం మాటలు.. వాయిస్ ఓవర్ లో వినిపించే లేడీ వాయిస్ మరీ పచ్చి బూతులు మాట్లాడటం వెగటు పుట్టిస్తోంది.

ఇలాంటి మాటలు రాసే రచయితకు ఎథిక్స్ లేవా? లేక వాటిని తెరపై ప్రదర్శించే నటీనటులకు ఇంగితం లేదా? అన్నదే అర్థం కావడం లేదు. ఒకానొక దశలో ఓ స్టార్ హీరో ఆడాళ్లనుద్ధేశించి కించపరుస్తూ అన్న ఓ బూతు మాటను కూడా ఈ టీజర్ లో పరోక్షంగా ఉపయోగించారు. ఇలాంటి బూతు మాటలకు పరాకాష్టగా వున్న ఈ విజువల్స్ కి అసలు సెన్సార్ చేయలేదా?.. యూట్యూబ్ లో అలా సెన్సార్ చేయకుండా వదిలేశారా? అన్న సందేహం కలుగుతోంది. ఇలాంటి సినిమాలు తీసి సభ్య సమాజానికి ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? ఈ సినిమా ద్వారా సమాజానికి.. నేటి యువతరానికి ఏం చెప్పాలనుకుంటున్నారో కనీసం తెరకెక్కించిన వాళ్లకైనా క్లారిటీ వుందా? అన్నది అర్థం కావడం లేదు.

ఆ మధ్య నరసింహానంది రూపొందించిన `డిగ్రీ కాలేజ్` టీజర్ లోనూ ఇదే తరహాలో వల్గర్ సీన్లతో.. క్లాస్ రూమ్ లోనే స్టూడెంట్స్ కూర్చునే బెంచీలపై కామకేళిలో పాల్లొన్న దృశ్యాల్ని యథేచ్ఛగా చూపించారు. ఇంతకీ ఈ స్థాయి వల్గర్ కంటెంట్ తో టీజర్లను కట్ చేస్తుంటే సెన్సార్ ఏం చేస్తోంది?. టీజర్లకు సెన్సార్ ఎందుకు చేయడం లేదు? ఇలాంటి వాటిని ఇలాగే వదిలేస్తే ఇంకా ఎలాంటి బూతును కనాల్సి వస్తుందో మరి.
Please Read Disclaimer