కరోనాతో కృష్ణా నగర్ సందడి మాయం

0

కరోనా కారణంగా గత అయిదు నెలుగా సినిమా పరిశ్రమ పూర్తిగా స్థంభించి పోయింది. మూడు నెలల లాక్ డౌన్ తర్వాత జూన్ లో షూటింగ్స్ కు అనుమతులు ఇచ్చినా కూడా స్టార్స్ కరోనా భయంతో షూటింగ్స్ కు హాజరు అయ్యేందుకు భయపడుతున్నారు. ఇలాంటి సమయంలో సినీ కార్మికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. వేలాది మంది సినీ కార్మికులతో ప్రతి రోజు సందడి సందడిగా కనిపించే కృష్ణా నగర్ వీధులు ఇప్పుడు బోసి పోయి కనిపిస్తున్నాయి. పూర్ణ టిఫిక్ సెంటర్ గణపతి కాంప్లెక్స్ ఇలా కృష్ణా నగర్ లోని ప్రతి అడ్డ కూడా ఇప్పుడు జనాలు లేక వెలవెల బోతుంది. సినిమా పరిశ్రమకు చెందిన 24 విభాగాల కార్మికులు కూడా కృష్ణా నగర్ లో కనిపిస్తూ ఉంటారు.

అయిదు నెలల క్రితం వరకు కృష్ణా నగర్ వీది వీదిలో సినిమా ముచ్చట్లు వినిపించేవి. ఎక్కడ పడితే అక్కడ జూనియర్ ఆర్టిస్టులు ఇతర విభాగాల కార్మికులు చర్చించుకుంటూ ఉండేవారు. తెల్లవారు జామున నాలుగు గంటల సమయంలోనే షూటింగ్స్ కు జూనియర్ ఆర్టిస్టులు మరియు సినీ కార్మికులు బయుజేరేవారు. వారి వారి అడ్డాల వద్దకు వచ్చి వెయిట్ చేస్తే కార్లు వ్యాన్ లు బస్సులు ఇలా రకరకాల వాహనాలు వచ్చి వారిని తీసుకు వెళ్లేవి. కాని ఇప్పుడు అవేవి కనిపించడం లేదు.

పొట్టి వీరయ్య బడ్డీ వద్ద ఉదయం సాయంత్రం సినిమా పరిశ్రమకు చెందిన వారు ఎంతో మంది కూర్చుని ముచ్చట్లు పెట్టుకుంటూ సరదాగా టీ తాగుతూ ఆ రోజు సంఘటనలు చర్చించే వారు. యూసుఫ్ గూడా నుండి చెక్ పోస్ట్ రోడ్డు వరకు సినిమా పరిశ్రమకు చెందిన వారితో నిండి పోయి ఉండేది. కాని ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఎక్కడ కూడా సినీ కార్మికులు కనిపించడం లేదు.

బతుకు దెరువు లేకపోవడంతో చాలా మంది ఊర్లకు వెళ్లి పోగా కొందరు సినీ ప్రముఖులు ఇచ్చిన సాయంతో పొట్ట పోసుకుంటూ బయటకు వెళ్లడం లేదు. ఈ నాలుగు నెలల కాలంలో దాదాపుగా 35 శాతం కృష్ణా నగర్ ఇళ్లు ఖాళీ అయ్యాయి అంటూ స్థానికులు చెబుతున్నారు. మళ్లీ పూర్తి స్థాయి షూటింగ్ లు జరిగినప్పుడు కృష్ణా నగర్ లో మాయం అయిన సందడి కనిపిస్తుందని అంటున్నారు.Please Read Disclaimer