రజనీ కోసం డిస్ట్రిబ్యూటర్ల ఎదురుచూపులు.. కారణం తెలిస్తే షాకే

0

సినిమా రీలజ్ కాక ముందు హైప్ తెచ్చేందుకు పడే పాట్లు అన్నిఇన్ని కావు. రిలీజ్ అయ్యాక.. పావలా పాపులార్టీకి రూపాయి వచ్చినట్లుగా ప్రచారం చేస్తూ సినిమాకు ఆదరణ కోసం చేసే ప్రయత్నాలు ఈ మధ్యన బాగా పెరిగిపోయాయి. దీంతో.. సినిమా హిట్టా.. ఫట్టా అన్న విషయాన్ని వెంటనే చెప్పలేని పరిస్థితి. ఇదిలా ఉంటే.. కలెక్షన్లు జోరుగా వస్తున్నట్లుగా సాగే ప్రచారం మరింత కన్ఫ్యూజింగ్ చేస్తోంది.

మొన్న సంక్రాంతి బరిలో దిగిన సినిమాల్లో రజనీ నటించిన దర్బార్ చిత్రం గురించి తెలిసిందే. మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మీద భారీ అంచనాలు వ్యక్తమైనా.. తీరా రిలీజ్ అయ్యాక రోటీన్ రజనీ సినిమాగా టాక్ తో అప్పటివరకూ సాగిన హైప్ చల్లారిపోయింది. తెలుగులో ఇలాంటి పరిస్థితి ఉన్నా.. తమిళంలో మాత్రం హిట్ టాక్ కొట్టిందన్న ప్రచారం సాగింది.

దీనికి కొనసాగింపుగా ఆ చిత్రానికి రూ.150 కోట్ల మేర కలెక్షకన్లు వచ్చాయని దర్బార్ చిత్ర నిర్మాణ సంస్థ లైకా పేర్కొంది. దీంతో.. సినిమా హిట్టేనన్న మాట అన్న భావన కలుగుతున్న వేళ.. అందుకు భిన్నంగా ఈ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేసిన వారి వాదన మరోలా ఉంది. కలెక్షన్ల ఫిగర్ల గురించి చెప్పే దానికి.. వాస్తవానికి ఏ మాత్రం పోలిక లేదన్న వాదనను వినిపిస్తున్నారు.

భారీగా కలెక్షన్లు వచ్చినట్లు చెప్పినా.. వాస్తవంగా అలాంటి పరిస్థితి లేదని.. దర్బార్ ను కొనుగోలు చేసి తాము దెబ్బ తిన్నట్లుగా వాపోతున్నారు. తమ కష్టాల్ని సూపర్ స్టార్ రజనీకి చెప్పటం ద్వారా ఆయన అంతో ఇంతో ఆదుకుంటారన్న ఆశతో ఉన్నారు. ఇందులో భాగంగా ఆయన్ను కలుసుకునేందుకు వారు విపరీతంగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. రజనీని తాము కలిస్తే.. నష్టపోయిన దానికి సంబంధించిన అంతో ఇంతో పరిహారం అందుతుందన్న ఆశను రజనీ ఎప్పటికి తీరుస్తారో చూడాలి.
Please Read Disclaimer