విమానం ఎక్కిన దర్బార్.. సూపర్ తలైవా!

0

సూపర్ స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా మురగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన దర్బార్ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చిత్రయూనిట్ పాన్ ఇండియా కేటగిరీలో ప్రచారంతో వెడెక్కిస్తోంది. వాణిజ్య రాజధాని ముంబై ని రజనీకాంత్.. సంగీతదర్శకుడు ఏ. ఆర్ రెహమాన్ ఇంటర్వూలతో చుట్టేస్తున్నారు. అటు సోషల్ మీడియాలో రోజుకొక కొత్త పోస్టర్ రిలీజ్ చేసి అభిమానులను ఖుషీ చేస్తున్నారు. అంతే కాకుండా ఛామింగ్ తలైవార్ అంటూ ఓ ప్రోమోని కూడా విడుదల చేసి అభిమానుల్లో జోష్ ని నింపారు. తాజాగా దర్బార్ ప్రచారం విమానం ఎక్కేసింది. ప్రతిసారీ రజనీ సినిమాలకు ఇదే తరహా ప్రచారమే చేస్తున్నారు. ఇంతకుముందు పలు చిత్రాలకు మలేషియన్ ఎయిర్ లైన్స్ సహకారం తో ప్రమోషన్ చేశారు. ఈసారి కూడా ఆ తరహాలోనే దర్బార్ పోస్టర్ల ను విమానానికి అతికించి ప్రచారం షురూ చేసారు.

ఈశైలి ప్రచారం ఒక్క సూపర్ స్టార్ కే చెల్లింది. గతంలో కబాలి సినిమా పోస్టర్లను కూడా ఇలాగే లోకల్ విమానాలకు అతికించి కావాల్సినంత ప్రచారం పొందారు. ఈ ఐడియా తొలిసారి కలైపులి ఎస్ థానుకు చెందిన వి క్రియేషన్స్ కి వచ్చిందట. ఈ తరహా ప్రచారం మొదలుపెట్టింది విక్రియేషన్స్ మాత్రమే. బాలీవుడ్ నిర్మాణ సంస్థలు సైతం చేయని అరుదైన ప్రచారాన్ని కోలీవుడ్ నిర్మాణ సంస్థ చేపట్టి అందరి దృష్టిని ఆకట్టుకుంది. తాజాగా విక్రియేషన్స్ దారిలోనే లైకా ప్రొడక్షన్స్ వెళ్తోంది.

ఈ తరహా ప్రచారం సినిమాకు బాగా కలిసొస్తుందని విశ్లేషకులు మాట. అంతర్జాతీయ ఎయిర్ పోర్టులతోనూ మన ఎయిర్ లైన్స్ కనెక్టివిటీ ముడిపడి ఉంటుంది కాబట్టి స్థానిక ప్రచారంతో పాటు.. విదేశీయులకు సినిమా గురించి బాగా తెలుస్తుంది. ఇక చైనా- మలేషియా- సింగపూర్ లాంటి దేశాల్లో తలైవాకి ఉన్న క్రేజ్ నేపథ్యంలో ఈ ప్రచారం మరింత ఉపయుక్తంగా ఉంటుందని అంటున్నారు. అయితే ఈ ప్రచారం కోసం సదరు నిర్మాణ సంస్థ విమానయాన సంస్థకు భారీగానే చెల్లించక తప్పదని తెలుస్తోంది. ఇకపోతే ఇలా విమాన ప్రచారం చేయడం బాగానే ఉంది కానీ తెలుగు రాష్ట్రాల్లో ప్రచారమే మరీ వీక్ గా ఉంది ఎందుకనో అంటూ ఇక్కడ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.
Please Read Disclaimer