స్టార్ హీరోయిన్.. పచ్చబొట్టు మాయం అయిందే!

0

చాలామంది హీరోలకు.. హీరోయిన్లకు పచ్చబొట్టు పొడిపించుకునే అలవాటు ఉంటుంది. బాలీవుడ్ లో ఈ టాటూ ట్రెండ్ ఎప్పటినుంచో ఉంది. అయితే అన్ని పచ్చబొట్లు కాటికి చేరే వరకూ ఉంటాయా అంటే మాత్రం ‘నో’ అనే జవాబు చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే బాలీవుడ్ లో ఒకరికి ఎన్ని లవ్ స్టోరీలు ఉంటాయో ఎవరికీ తెలీదు. జీవితాంతం ఒకే ఒక లవర్ ఉంది అంటే.. ఆ పేరు చేతి మీదనో ఛాతీ మీదనో బలంగా ముద్రించుకోవచ్చు. అలా కాదు కదా. సల్మాన్.. సంజయ్ లాంటి వారు తమ లవర్ల పేర్లు బాడీపై పచ్చబొట్లు పొడిపించుకోవాలంటే ఏం చెయ్యాలి? బాడీలో ప్లేస్ సరిపోదు! ఇలాంటి డైలాగ్స్ వింటే.. ఎప్పుడూ భాయిజాన్ ని.. దత్తు సాబ్ ని ఆడిపోసుకుంటారు అని కొందరు అభిమానులు ఫీలయ్యే అవకాశం ఉంది. అందుకే ఇప్పుడు దీపిక పదుకొనె గురించి మాట్లాడుకుందాం.

దీపిక పదుకొనె బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ ను వివాహమాడి శ్రీమతిగా మారిన సంగతి తెలిసిందే. అయితే దీపిక రణవీర్ సింగ్ తో లవ్వు.. మ్యారేజ్ కంటే ముందు రణబీర్ కపూర్ తో ప్రేమాయణం నడిపింది. ఎంతో ఘాటుగా ఇద్దరూ ప్రేమించుకున్నారు. చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. ఆలా ప్రేమ గాఢత పీక్స్ లోకి చేరిన సమయంలో దీపిక తన మెడపై ‘RK’ అనే పచ్చబొట్టు వేయించుకుంది. ఆర్ కె అంటే అర్థం అయింది కదా..? రణబీర్ కపూర్ ఇనిషియల్స్. ఆ టాటూ హాట్ టాపిక్ కూడా అయింది. అయితే రణబీరుడు మాత్రం తనకు అలవాటైన రీతిలో దీపికకు హ్యాండ్ ఇచ్చాడు. దీంతో దీపిక కొన్ని రోజులు సింగిల్ స్టేటస్ ను ఎంజాయ్ చేసి తర్వాత రణవీర్ సింగ్ కు తన ప్రేమ వైఫైని నేర్పుగా కనెక్ట్ చేసింది. సింగుగారు కూడా ప్రతిస్పందించడంతో ఇద్దరూ హాయిగా కలిసి తిరగారు. ఫైనల్ గా ఇద్దరూ ఒకింటివారయ్యారు.

అయితే ఇంత స్టోరీ జరిగినా దీపిక తన మాజీప్రియుడు రణబీర్ కపూర్ పచ్చబొట్టును మాత్రం తొలగించలేదు. సినిమాల షూటింగ్ సమయంలో మాత్రం మేకప్ తో కవర్ చేసేది. తాజాగా ఈ పచ్చబొట్టు మాయం అయింది. దీపిక తన కొత్త సినిమా ‘ఛపాక్’ ప్రమోషన్స్ లో భాగంగా మీడియాను కలిసింది. ఈ సమయంలో దీపిక మెడ మీద టాటూ మాయం కావడం అందరినీ ఆకర్షించింది. మరి ఆ పచ్చబొట్టు లేజర్ ట్రీట్మెంట్ తో శాశ్వతంగా తొలగించుకుందా లేదా మేకప్ తో కవర్ చేసిందా అని చర్చలు సాగుతున్నాయి. ఇలాంటి అంశాలు గమనించడంలో ఆరితేరిన కొందరు సామాజిక మాధ్యమాల మేథావులు ఈ పచ్చబొట్టు పర్మనెంట్ గా హుష్ కాకీ అని శెలవిస్తున్నారు. త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ వస్తుంది లెండి.
Please Read Disclaimer