#KRKR ఐటమ్ సాంగ్.. వర్మ తోపులే

0

సెటైర్లు వేయడం .. పంచ్ లతో విరుచుకుపడడం.. ప్రత్యర్థుల్ని ఉడికించడం..నచ్చనివాళ్లందరినీ కెలకడం.. చివరికి మీడియాని వెర్రెత్తించడం ఇంకా ఇలాంటి క్రీడలు ఎన్నని చెప్పాలి. ఆర్జీవీ `కమ్మ రాజ్యంలో కడప రెడ్లు` ఇలాంటి ఎన్నో వినోద ఘట్టాలతో హీటెక్కిస్తోంది. తెరనిండుగా పొలిటీషియన్ల కామెడీలు మామూలుగా లేవని ఇదిగో తాజాగా రిలీజ్ చేసిన పొలిటికల్ ఐటెమ్ సాంగ్ చెబుతోంది.

ఇందులో యథావిధిగానే చంద్రబాబు- లోకేష్ బాబు అండ్ కోను ఆర్జీవీ ఓ రేంజులోనే ఆడుకున్నాడు. మిర మిర సైడు చూపులు చూస్తూ.. పొట్టను పొంగించి నిలబడడం.. ఖాకీ చొక్కాతో ఆటో ఎక్కడం.. పప్పూపై ప్రేమ.. చంద్రబాబు వాలకంలో ఏదీ మిస్ కాకుండా ప్రతిదీ తెరపై చూపిస్తూ ఆర్జీవీ ఆడేసుకున్నాడు. ఓవైపు ఏపీ సీఎం వైయస్ జగన్ అసెంబ్లీలో ప్రత్యర్థులను ఆడుకుంటున్న సన్నివేశాన్ని హైలైట్ చేస్తూ.. తేదేపా యువనాయకుడు లోకేష్ నాయుడు ప్రచారాన్ని.. జనసేనాని పవన్ కల్యాణ్ వాలకాన్ని ప్రతిదీ సెటైరికల్ పంథాలో ఆర్జీవీ చూపించిన తీరుకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. దేవినేని.. ప్రధాని నరేంద్ర మోదీ- అమిత్ షా వంటి వారిని ఈ వీడియోలో ఎలివేట్ చేశారు. సాంగ్ మధ్యలో హాస్య బ్రహ్మీని.. బిగ్ బాస్ ఫేం నాయుడుని ఛమక్కులాంటి ఎక్స్ ప్రెషన్స్ తో ఎంతో ఎఫెక్టివ్ గా చూపించిన ఆర్జీవీకి ప్రత్యేకించి జేజేలు పలకాలి.

ఇప్పటి రాజకీయాల్ని చూస్తే భారతంలో శకుని కూడా సెల్యూట్ కొట్టాలి! అంటూ లిరిక్ లో రాజకీయాల పరమార్థాన్ని అద్భుతంగా వర్ణించారు. సెటైరికల్ కామెడీని అద్భుతమైన ఎక్స్ ప్రెషన్స్ తో తెరకెక్కించారనడానికి ఈ ఐటెమ్ పాటనే సాక్ష్యం. సెన్సార్ ట్రబుల్స్ వల్ల కమ్మరాజ్యంలో కడప రెడ్లు టైటిల్ ని `అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు`గా మారుస్తున్నారని ప్రచారం ఉంది. ఈనెల 29న రిలీజ్ చేస్తున్నామని ప్రకటించారు. మరి సెన్సార్ పూర్తవ్వలేదు. రిలీజ్ వాయిదా వేయాల్సిందిగా కోర్టు నిర్మాతలకు సూచించిందని తెలుస్తోంది. దీనిపై ఆర్జీవీ టీమ్ నుంచి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉందింకా.




Please Read Disclaimer