స్టార్ హీరోకు రిలీజ్ కష్టాలేమిటో!

0

ఈ శుక్రవారం నాలుగైదు సినిమాల రిలీజ్ తేదీల్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే రెండు సినిమాలు సజావుగా రిలీజైనా రెండిటికి మాత్రం ఊహించని పంచ్ పడింది. నిఖిల్ అర్జున్ సురవరం .. కొత్త కుర్రాళ్లతో తెరెకెక్కించిన రాజా వారు రాణి గారు థియేటర్లలోకి వచ్చాయి. ఆర్జీవీ – కమ్మ రాజ్యంలో కడప రెడ్లు.. ధనుష్ – గౌతమ్ మీనన్ ల `తూటా` థియేటర్లలోకి రిలీజ్ కాలేదు.

`కమ్మ రాజ్యంలో కడప రెడ్లు` చిత్రానికి వివాదాలు అడ్డంకిగా మారాయి. పైగా ఆర్జీవీ బృందానికి వ్యతిరేకంగా కోర్టు తీర్పు వెలువడడంతో ఈ సినిమా టైటిల్ మార్పు సహా రిలీజ్ వాయిదా తప్పలేదు. ప్రస్తుతం చిత్రబృందం `అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు` అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారు. ఇప్పటికీ సెన్సార్ పూర్తి కాకపోవడంతో ఆర్జీవీ అండ్ టీమ్ కి గట్టి దెబ్బ పడింది. రకరకాల నాటకీయ పరిణామాల నడుమ కమ్మ రాజ్యంలో కడప రెడ్లు రిలీజ్ కి బ్రేక్ పడింది. ఇక రిలీజ్ కొత్త తేదీ ఎప్పుడు అన్నది తేలాల్సి ఉంది.

స్టార్ హీరో ధనుష్ నటించిన తమిళ చిత్రం `ఎనాయ్ నోకి పాయుమ్ తోట` రిలీజ్ ముందే బోలెడంత డైలమా కొనసాగింది. రెండున్నరేళ్లుగా రిలీజ్ వాయిదాలతో ల్యాబుకే అంకితమైన చిత్రమిది. ఈ చిత్రాన్ని తెలుగులో తూటా పేరుతో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. కానీ చివరి నిమిషంలో ఏమైందో అమెరికా ప్రీమియర్లు క్యాన్సిల్ అయ్యాయని తెలిసింది. అలాగే తమిళనాడులో ఉదయం ఆటల్ని క్యాన్సిల్ చేశారన్న సమాచారం ఉంది. ఈ సినిమా డిసెంబర్ లో రిలీజ్ కానుందని తాజాగా సమాచారం అందింది. తెలుగులో `తూటా` కొత్త రిలీజ్ తేదీని వియభేరి సంస్థ ప్రకటించాల్సి ఉంది. మొత్తానికి గౌతమ్ మీనన్ కి స్టార్ హీరో ధనుష్ కి మధ్య విభేధాలు.. పంపిణీ వర్గాల్లో అంతర్గత విభేదాలు.. ఇతరత్రా కారణాలు ఈ సినిమాని తమిళనాట చాలాచోట్ల సాఫీగా రిలీజ్ కానివ్వలేదని అర్థమవుతోంది.
Please Read Disclaimer