డార్లింగ్ కు మరోసారి ధూమ్ ఆఫర్??

0

హిందీ ప్రేక్షకుల్లో క్రేజ్ సాధించిన ఒకే తెలుగు హీరో ప్రభాస్. ఈ విషయం ‘బాహుబలి’ రెండు భాగాలు రిలీజ్ అయిన సమయంలో చాలామంది నమ్మలేదు కానీ ‘సాహో’ సినిమా హిందీ వెర్షన్ సూపర్ హిట్ కావడంతో నమ్మకతప్పలేదు. కంటెంట్ అంతంతమాత్రమే ఉన్న ‘సాహో’ తో హిందీ బెల్ట్ లో ఆ రేంజ్ కలెక్షన్స్ వచ్చాయి అంటే.. ఒకవేళ నిజంగా సినిమా సూపర్ అయితే కలెక్షన్ల వర్షం కురిసి ఉండేదనడంలో ఆశ్చర్యం లేదు. అందుకే ఇప్పటికీ ప్రభాస్ తో సినిమా చేసేందుకు బాలీవుడ్ నిర్మాతలు ఆసక్తి చూపిస్తూనే ఉన్నారట.

బాహుబలి 2 తర్వాత ప్రభాస్ కు కొన్ని బాలీవుడ్ ఆఫర్లు వచ్చాయి కానీ ప్రభాస్ మాత్రం ఎవరికీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. అందులో ఒక ఆఫర్ ఆదిత్య చోప్రా నుంచి వచ్చింది. సక్సెస్ ఫుల్ యాక్షన్ ఫిలిమ్స్ ఫ్రాంచైజీ అయిన ‘ధూమ్’ లో నాలుగవ భాగానికి ప్రభాస్ ను తీసుకుందామని ఆయన ప్లాన్ చేశారట. అయితే ప్రభాస్ ఒప్పుకోకపోవడంతో ఆ ఆలోచన పక్కన పెట్టారట. కానీ ఈమధ్య.. ‘వార్’.. ‘సాహో’ లాంటి యాక్షన్ ఫిలిమ్స్ కు దక్కిన ఆదరణ చూసిన తర్వాత ధూమ్ సీరీస్ లో ఫోర్త్ పార్ట్ తెరకెక్కించాలని ఆయన నిర్ణయించుకున్నాడట. అందుకే మరోసారి ప్రభాస్ ను సంప్రదించారని సమాచారం.. ప్రభాస్ కనుక ఓకే చెప్తే ఈ సినిమాలో విలన్ పాత్రలో నటించాల్సి ఉంటుంది.

‘ధూమ్’ సీరీస్ గురించి తెలిసిన వారు సరే కానీ తెలియనివారు మాత్రం ఈ ‘విలన్’ రోల్ అనగానే అవాక్కయ్య అవకాశం ఉంది. నిజానికి ‘ధూమ్’ సీరీస్ లో హీరోది నామమాత్రమైన పాత్ర. అది అభిషేక్ బచ్చన్ చేస్తాడు. విలన్లు మాత్రం పవర్ ఫుల్.. మొదటి భాగంలో జాన్ అబ్రహం.. రెండవ భాగంలో హృతిక్ రోషన్. మూడవ భాగంలో ఆమిర్ ఖాన్ విలన్ పాత్రలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. అన్నీ భాగాలు సూపర్ హిట్లే. ఈ లెక్కన ప్రభాస్ ‘ధూమ్ 4’ లో నటిస్తే భారీ క్రేజ్ రావడం ఖాయం. మరి డార్లింగ్ ఈ సినిమాకు ఒప్పుకుంటాడో లేదా నటించనని చెప్పి సున్నితంగా తప్పించుకుంటాడో వేచి చూడాలి.
Please Read Disclaimer