బిగ్ బాస్ హౌస్ లో నటి సూసైడ్ అటెంప్ట్

0

వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుంటుంది బిగ్ బాస్ షో. అందుకు తగ్గట్లే పరిణామాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. తాజాగా తమిళ సీజన్ 3లో కంటెస్టెంట్లలో ఒకరైన హాస్య నటి ఒకరు హౌస్ లోనే ఆత్మహత్యాయత్నం చేసుకోవటం సంచలనంగా మారింది. ఈ రియాల్టీ షోలో ఇలా ఒక కంటెస్టెంట్ సూసైడ్ అటెంప్ట్ చేసుకునే పరిస్థితి ఇప్పటివరకూ చోటు చేసుకోలేదని చెబుతున్నారు.

తాజా సీజన్ లో హౌస్ లో ఉంటున్న వారు ఏదో ఒక వివాదంలోకి చిక్కుకుంటున్నారు. ఇప్పటికే ఈ సీజన్ ఆరంభమైన నాటి నుంచి హౌస్ లోకి పోలీసులు ఎంట్రీ ఇవ్వాల్సి వచ్చింది. తాజాగా చోటుచేసుకున్న సూసైడ్ అటెంప్ట్ లోకి వెళితే.. కోలీవుడ్ లో హాస్య నటిగా పేరున్న మధుమిత ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. గడిచిన 50 రోజులుగా బిగ్ బాస్ హౌస్ లో ఉంటున్న మధుమిత.. కెప్టెన్ బాధ్యతల్ని నిర్వహిస్తున్న తరుణంగా సూసైడ్ అటెంప్ట్ చేయటం సంచలనంగా మారింది.

ఇంట్లోని సభ్యుల వేధింపులతోనే తాను ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లుగా ఆమె చెబుతున్నారు. తమిళ బిగ్ బాస్ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు విశ్వనటుడు కమల్ హాసన్. గడిచిన రెండు సీజన్లలోనూ వివాదాస్పద ఘటనలు చోటు చేసుకున్నాయి. తాజా సీజన్ 3లో పాల్గొంటున్న సెలబ్రిటీలపై సంచలన ఆరోపణలు రావటం.. వాటిని విచారించే క్రమంలో ఇప్పటికే రెండుసార్లు పోలీసులు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లాల్సి వచ్చింది.

నటి వనితా విజయ్ కుమార్ తన కుమార్తెను కిడ్నాప్ చేసిందన్న ఆరోపణలతో హైదరాబాద్ పోలీసులు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి ఆమె వివరణ తీసుకున్నారు. దీనికి సంబందించిన ఆమె వాంగ్మూలం తీసుకోవటంతో పాటు.. ఆమె కుమార్తెను విచారించగా.. తాను ఇష్టంతోనే తన తల్లి వద్దకు వచ్చినట్లుగా చెప్పటంతో ఈ వివాదం ఒక కొలిక్కి వచ్చింది.

ఇదే షోలో మరో కంటెస్టెంట్ గా ఉన్న నటి మీరా మిథున్ పైన మోసం ఆరోపణలు వచ్చాయి. దక్షిణ భారత అందాల పోటీల్ని నిర్వహించే అంశంపై ఆమె వివాదానికి కారణమయ్యారు. ఈ అందాల పోటీల్లో ఒక వ్యక్తికి డిజైనరుగా అవకాశం ఇచ్చేందుకు రూ.50వేలు తీసుకొని మోసం చేశారన్న ఆరోపణపైనా తమిళనాడు పోలీసులు ఆమెను విచారించేందుకు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి ఆమెను విచారించారు.

తాను ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో ఉన్నందున తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరిన ఆమె.. తాను హౌస్ నుంచి బయటకు రాగానే పోలీసుల విచారణకు సహకరిస్తానని పేర్కొనటంతో ఆమెకు బెయిల్ మంజూరు చేసింది కోర్టు. ఇలా.. వరుస పెట్టి వివాదాల్లోకి వెళుతున్న తమిళబిగ్ బాస్ సీజన్ త్రీలో.. తాజాగా ఒక నటి సూసైడ్ అటెంప్ట్ చేయటం సంచలనంగా మారింది.
Please Read Disclaimer