కుప్పలు తెప్పలుగా యాప్‌లు.. వెలవెలబోతున్న థియేటర్లు

0

హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్డు ఆబిడ్స్ సికింద్రాబాద్ మూసాపేట తదితర ప్రాంతాలు ఒకప్పుడు సినీ పరిశ్రమకు జేజేలు పలికేవి. శుక్రవారం వచ్చిందంటే చాలు ప్రేక్షకులు సినీ అభిమానులతో రద్దీగా కనిపించేవి. నాటి ఎన్టీఆర్ నుంచి నేటీ జూనియర్ ఎన్టీఆర్ వరకు ఎంతో మంది సినిమాలు అక్కడ ఆడాయి.. ఆడుతున్నాయి. సినిమా టికెట్ల కోసం యుద్ధ వాతావరణం అభిమానుల మధ్య గలాట తదితర జరిగేవి. ఎప్పుడూ చూసిన ప్రేక్షకాభిమానులతో కళకళలాడే ఆ ప్రాంతాలు ఇప్పుడు వెలవెలబోతున్నాయి. థియేటర్లు ఇప్పుడు వెలవెలబోతున్నాయి. ఎందుకంటే యాప్‌ల ప్రభావం.

పుట్టగొడుగులుగా ఇబ్బడిముబ్బడిగా యాప్‌లు పుట్టుకొస్తున్నాయి. యాప్‌లలో సినిమాలు నేరుగా వస్తున్నాయి. థియేటర్లో ఆడాల్సిన సినిమా కొన్ని రోజులకే యాప్‌లలో వస్తుండడంతో ప్రజలు సినిమా థియేటర్ కు రావడం మానేశారు. ఇంట్లోనే తాపీగా వీలు చిక్కినప్పుడు చూసేస్తున్నారు. భారతదేశంలో పేదవాడికి ఒక్కపూట భోజనం ఉచితంగా లభించడం లేదు.. కానీ డేటా మాత్రం ఉచితంగా లభిస్తోంది. ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది. దీంతో యాప్‌లు ఇన్స్టాల్ చేసుకోవడం సినిమాలు వీడియోలు చూడడం సర్వ సాధారణమైపోయింది. ముఖ్యంగా ఇళ్లల్లో దుప్పట్లు కప్పుకుని మరీ వీడియోలు సినిమాలు చూస్తున్న వారు పెరిగిపోయారు. దీని ప్రభావంతో యాప్ మార్కెట్లోకి చిన్న మధ్య సంస్థలతో పాటు బహుళ జాతి సంస్థలు కూడా ప్రవేశిస్తున్నాయి.

ప్రస్తుతానికి మార్కెట్ లో ఆమెజాన్ ప్రైమ్ హాట్ స్టార్ నెట్‌ఫ్లిక్స్ షో బాక్స్ మూవీ బాక్స్ టుబీ టీవీ తదితర యాప్‌లతో బోలెడు ఉన్నాయి. వీటితోపాటు ఇప్పుడు టీవీ ఛానల్ నెట్‌వర్క్‌లు కూడా యాప్‌లు తీసుకొచ్చాయి. జీ 5 స్టార్ సోనీ జెమినీ తదితర ఛానళ్లు యాప్‌లు తీసుకొచ్చి అందులో సినిమాలు పెడుతున్నాయి. దీంతో ఆ యాప్‌లను ఇన్స్టాల్ చేసుకుని ప్రజలు ఎంచక్కా హాయిగా ఇంట్లో కూర్చొని సినిమాలు చూస్తున్నారు. దీన్నే డిజిటల్ రైట్స్ అని అంటారు. అంటే డిజిటల్ మీడియాలో సినిమా పెట్టేందుకు హక్కులు అన్నమాట. అందుకే ఇప్పుడు డిజిటల్ మీడియా హక్కులు సినిమాలకు భారీ రేట్లు పలుకుతున్నాయి.

వీటితో పాటు స్పోర్ట్స్ యాప్‌లు కూడా ఉన్నాయి. ఇప్పుడు సర్వం యాప్మయమైంది. ఎందుకంటే నామమాత్రపు చెల్లింపుతో ఏడాది పాటు ఆరు నెలలు మూడు నెలల తదితర కాలపరిమితి కూడిన అనుమతులు ఉండడం.. హెచ్డీ క్వాలిటీతో సినిమాలు ఉంటుండడంతో ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారు. యువత అనే కాకుండా ఇంటిల్లిపాది యాప్‌లో మునిగిపోతున్నారు. ఈ యాప్‌లలో సినిమాలతో పాటు వెబ్ సిరీస్ షార్ట్ ఫిల్మ్స్ క్రికెట్ ఆటలు తదితర అన్నీ ఒక్క దాంట్లో లభిస్తుండడంతో అందరూ యాప్ వైపే మొగ్గుతున్నారు. తాజాగా తెలుగులో ‘ఆహా’ యాప్ వచ్చింది. సినీ ప్రముఖులంతా హాజరై ఆ యాప్ ను ఆవిష్కరించారు. ఈ విధంగా యాప్‌లు పెరిగిపోయి ఇక థియేటర్‌కు రావడం మానేశారు. పేరు మోసిన థియేటర్లు కూడా ఇప్పుడు ప్రేక్షకులు లేక వెలవెలబోతున్నారు.

ఒకప్పుడు మొదటి రోజు మొదటి షో చూడాలనే ఆశ అందరిలో ఉండేది. పెద్ద పెద్ద హీరోల సినిమాలైతే వారం రోజుల పాటు టికెట్ల కోసం కొట్టుకోవాల్సిన పరిస్థితి ఉండేది. ఇప్పుడు కొత్త సినిమాలకు మహా అంటే రెండు రోజులకే టికెట్లు ఈజీగా లభిస్తున్నాయి. థియేటర్ కు పోయి సినిమా చూద్దామంటే ‘ఎందుకు రా.. కొన్ని రోజులు ఆగు యాప్ లో వస్తుంది.. కలిసి చూద్దాం’ అని స్నేహితులు చెబుతున్న పరిస్థితి. మరీ ఈ యాప్‌లు థియేటర్ల పై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. భవిష్యత్ లో థియేటర్ మనుగడ కే ప్రశ్నార్థకం గా మారాయి.
Please Read Disclaimer