పాపం రవిబాబు.. దిల్ రాజు బ్యానర్ ప్లస్ కాలేదే

0

దర్శకుడు రవిబాబు మొదటినుంచి విభిన్నసినిమాలే తెరకెక్కించారు. జయాపజయాలతో సంబంధం లేకుండా ఇప్పటికీ అదే పంథాను అనుసరిస్తున్నారు. అయితే గత కొంతకాలంగా రవిబాబు తెరకెక్కించిన సినిమాలు ప్రేక్షకులను మెప్పించలేకపోతున్నాయి. తన ప్రతి సినిమాకు దాదాపుగా సురేష్ ప్రొడక్షన్స్ భాగస్వామ్యంతో ముందుకు సాగుతూ వస్తున్న రవిబాబు తన లేటెస్ట్ ఫిలిం ‘ఆవిరి’ కి మాత్రం దిల్ రాజు కాంపౌండ్ లోకి వచ్చారు. రాజుగారితో అసోసియేట్ అయితే సినిమాకు భారీగా ప్లస్ అవుతుందనుకుంటే ఇప్పుడు పరిస్థితి పూర్తిగా రివర్స్ లో ఉంది.

‘ఆవిరి’ నవంబర్ 1 న.. అంటే ఈ రోజే ప్రేక్షకులముందుకు వచ్చింది. అయితే ఈ సినిమాపై ఎక్కడా బజ్ కనిపించడం లేదు. పైగా చాలామందికి ఈ సినిమా రిలీజ్ అవుతున్న విషయం కూడా తెలియదు. ఈరోజు ‘ఆవిరి’ సినిమా రిలీజ్ కదా అంటే.. ‘అవునా?’ అంటూ తెల్లమొహం వేస్తున్నారు. దిల్ రాజు బ్యానర్ తో టై అప్ అయితే సినిమాకు పబ్లిసిటీ దక్కుతుందని అనుకుంటే అలా జరగకపోగా సినిమాకు బజ్ లేకుండా పోయింది. ఈమధ్య దిల్ రాజు బ్యానర్ లో రిలీజ్ అవుతున్న సినిమాలకు ప్రమోషన్స్ విషయంలో పట్టించుకోకపోవడంతో ఇలాగే జరుగుతోంది. కొద్దిరోజుల క్రితం రాజుగారు ప్రెజెంట్ చేసిన మరో చిన్న సినిమాకు ఇదే పరిస్థితి ఎదురైంది.

గతంలో రవిబాబు సినిమాలు ఎలా ఉన్నా మంచి ప్రమోషన్ దక్కేది. వింత ఐడియాలతో రవిబాబు చేసే ప్రమోషన్ తో కనీసం ఓపెనింగ్ కలెక్షన్లు అయినా దక్కేవి. ఈ సినిమాకు అది కూడా జరగలేదు. దీంతో రాజుగారి బ్యానర్లో సినిమాను రిలీజ్ చేస్తే ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కట్టేస్తారు అనే పాత అభిప్రాయం మార్చుకోవాల్సి వస్తోంది. ఏదేమైనా ఇలా జరగడం రాజుగారి బ్రాండ్ ఇమేజ్ ను మరింత దెబ్బకొట్టేలా ఉంది.
Please Read Disclaimer