పవన్ తో సినిమా కల అతనికి తీరిపోతుందట

0

సినిమాలో తెలీని ఆకర్షణ శక్తి ఉంటుంది. ఎంత వద్దనుకున్నా వదిలిపెట్టలేరు. రాజకీయాల్లోకి వచ్చాక సినిమాలు కంటిన్యూ చేయటం కష్టమంటారు. ఊగిసలాటలో కొంతకాలం.. తర్వాత వద్దనుకోవటం మామూలే. అలా చెప్పినా.. ఆ మాట మీద నిలవటం అంతే తేలికైన విషయం కాదు. తాజాగా ఆ విషయం మరోసారి ఫ్రూవ్ అయ్యింది పవన్ కల్యాణ్ తో.

జనసేన పార్టీ పెట్టిన తర్వాత కూడా సినిమాలు చేసిన ఆయన.. ఎన్నికలకు కాస్త ముందుగా సినిమాలకు సైన్ ఆఫ్ చేసి.. ఇక తన చూపంతా రాజకీయాల మీదనేనని ప్రకటించారు. సినిమాలు చేయటం తనకు మొదట్నించి ఇష్టముండదన్న ఆయన.. ప్రజాసేవలో తరిస్తానన్న మాటను చెప్పేవారు. మాటలు చెప్పినంత ఈజీ కాదు చేతల్లో చేసి చూపించటమన్న మాటకు తగ్గట్లే.. సినిమాలు చేయనన్న పవన్.. తన మనసు మార్చుకోవటానికి అట్టే కాలం పట్టలేదు.

హిందీ పింక్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయాలనుకోవటం.. దాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు హక్కుల్ని సొంతం చేసుకోవటం తెలిసిందే. 2020లో ఈ సినిమా నిర్మాణం షురూ కానుంది. ఈ చిత్రంలో పవన్ నటిస్తున్నారన్న మాట ఆయన అభిమానులకు ఆనందాన్ని ఇస్తోంది. అయితే.. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాల్ని ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో వెల్లడించారు దిల్ రాజు.

ఎంసీఏ దర్శకుడు వేణుశ్రీరామ్ దర్శకత్వం వహించే పింక్ రీమేక్ కు సంబంధించి పవన్ డేట్లను ఖరారు చేయాల్సి ఉందన్నారు. పవన్ కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేస్తున్నట్లు చెప్పిన దిల్ రాజు.. తాను ఎంతోకాలంగా సినిమా ఇండస్ట్రీలో ఉన్నా రెండు కోరికలు మాత్రం నెరవేరలేదన్నారు.

అందులో ఒకటి హిందీలో సినిమా తీయటం.. రెండోది పవన్ కల్యాణ్ తో సినిమాగా చెప్పిన దిల్ రాజు.. తన తీరని రెండు కోరికల్ని 2020లో తీర్చుకోనున్నట్లు చెప్పారు. రానున్న కొత్త సంవత్సరం కచ్ఛితనంగా తన కెరీర్ లో మైలురాయిగా అభివర్ణిస్తున్న దిల్ రాజు మాటలు ఎలా ఉన్నా.. ఆయన చెప్పిన పవన్ చిత్ర విశేషాలు మాత్రం పీకే ఫ్యాన్స్ కు పండుగలా మారుతాయని చెప్పటంలో సందేహం లేదు.
Please Read Disclaimer