రాజమౌళికి 10 సినిమాల టైమ్ పడితే..!

0

రామోజీ ఫిలింసిటీలో `సాహో` ప్రీరిలీజ్ ఈవెంట్ అత్యంత వైభవంగా జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిధిగా విచ్చేసిన దిల్ రాజు పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. `సాహో` వేదిక సాక్షిగా యువతరం దర్శకుడు సుజీత్ ని ఆకాశానికెత్తేశారు. ఎస్.ఎస్.రాజమౌళికి బాహుబలి లాంటి చిత్రం తీయడానికి 10 సినిమాలకు పైగా సమయం పడితే.. సుజీత్ రెండో చిత్రంతోనే ఆలిండియా చిత్రాన్ని తీశాడని ప్రశంసించారు.

`సాహో` వేదికపై దిల్ రాజు మాట్లాడుతూ-“యువి క్రియేషన్స్ నిర్మాతలతో నాకు మంచి అనుబంధం ఉంది. `మిస్టర్ పర్ఫెక్ట్` తర్వాత యువీ సంస్థ `మిర్చి` చిత్రాన్ని తీసింది. ఆ చిత్రానికి `మిస్టర్ పర్ఫెక్ట్` కు మించి ఖర్చు చేశారు. అంత ఎందుకు పెడుతున్నారు? అని ప్రశ్నించాను. “ప్రభాస్ కోసం“ అని బదులిచ్చారు. మళ్లీ `బాహుబలి `తర్వాత అంతకు మించి `సాహూ` చిత్రానికి ఖర్చు చేశారు. ఈ సారి కూడా “ప్రభాస్ కోసమే“ అని బదులిచ్చారు. సాహో నిర్మాతల్ని చూసి `ఆలిండియా ఫిలిం` ఎలా తీయాలో నేర్చుకుంటున్నా! అని దిల్ రాజు అన్నారు. బాహుబలితో తెలుగు సినిమా సత్తాని ప్రపంచం మొత్తానికి తెలియజేసిన రాజమౌళికి కృతజ్ఞతలు తెలిపారు.

“ప్రభాస్ ఆలిండియా స్టార్. ఏ రాష్ట్రానికి వెళ్లినా ప్రభాస్ అభిమానులు కనిపిస్తున్నారు. ప్రభాస్ ఇలాగే భారీ చిత్రాల్లో నటిస్తూ అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని దిల్ రాజు ఆకాంక్షించారు. ఈ వేదికపై అల్లు అరవింద్- వినాయక్ తదితర ప్రముఖులు చిత్రయూనిట్ కి శుభాకాంక్షలు తెలిపారు.
Please Read Disclaimer