దిల్ రాజు రూటు మార్చక తప్పదా?

0

దిల్ రాజు టాలీవుడ్ లో స్టార్ ప్రొడ్యూసర్ మాత్రమే కాదు.. సక్సెస్ కు కేరాఫ్ అడ్రెస్ అన్నట్టుగా ఉండేవారు. నిర్మాతగా మాత్రమే కాదు పంపిణీదారుడిగా కూడా ఆయన టేకప్ చేసిన సినిమాలు కాసుల వర్షం కురిపించేవి. ఆయన నైజాం ఏరియా రైట్స్ తీసుకున్నారంటే మిగతా ఏరియాల్లో ఆ సినిమా రైట్స్ కళ్ళుమూసుకుని నిర్మాత చెప్పిన ధరకు ఇతర బయ్యర్లు తీసుకునేవారు. కానీ ఈమధ్య కాలంలో రాజుగారికి అటు నిర్మాతగాను.. ఇటు డిస్ట్రిబ్యూటర్ గానూ ఫెయిల్యూర్స్ తప్పడం లేదు. విజయాలు అసలు లేవని కాదు కానీ అపజయాల శాతం విపరీతంగా పెరిగింది.

మహేష్ బాబు ‘మహర్షి’ చిత్రానికి రాజుగారు సోలో ప్రొడ్యూసర్ కాదు. అయినా ఆ సినిమా సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ అని ఊదరగొట్టారు. కానీ ఆ సినిమా కలెక్షన్ల సంగతి ఇంటర్నల్ గా అందరికీ తెలుసు. ‘మహర్షి’ చిత్రం కొన్న బయ్యర్లు అందరూ ప్రాఫిట్స్ లోకి రాలేదు. కొన్ని ఏరియాల్లో బయ్యర్లకు నష్టాలు వచ్చాయి. అది పక్కన పెడితే ఈమధ్య ‘ఎవ్వరికీ చెప్పొద్దు’ అనే సినిమాను రాజుగారు తన సొంత బ్యానర్ పై రిలీజ్ చేశారు. జీరో ప్రమోషన్స్ దెబ్బకు ఆ సినిమా రిలీజ్ అవుతున్న సంగతి ఎవరికీ తెలియలేదు. ఏదో ఒక కొత్త నిర్మాత సినిమా రిలీజ్ అవుతుందని తెలియకపోతే సరిపెట్టుకోవచ్చు కానీ దిల్ రాజు లాంటి స్టార్ ప్రొడ్యూసర్ అసోసియేట్ అయిన సినిమా రిలీజ్ సంగతి ప్రేక్షకులకు తెలియలేదంటే అంతకంటే విడ్డూరం మరొకటి ఉండదు. గతంలో దిల్ రాజు చేతిలో సినిమా పెడితే హిట్ అనేవారు. ఇపుడు ఆయన చేతిలో పెడితే ‘ఎవరికీ తెలియడం లేదు’ అనే పరిస్థితి వచ్చింది.

ఇక రవిబాబు సినిమాలు ఎలా ఉన్నప్పటికీ ప్రమోషన్స్ తో తన సినిమా గురించి అందరికీ తెలిసేలా చేస్తారు. రీసెంట్ గా ఆయన తన ‘ఆవిరి’ చిత్రాన్ని దిల్ రాజు బ్యానర్ లో రిలీజ్ చేస్తున్నారు. రవిబాబు తన ప్రయత్నాలతో సినిమాను ప్రమోట్ చేసుకుంటున్నారు తప్పించి రాజుగారు ఈ విషయంలో పెద్దగా ఏమీ చేయడం లేదని అంటున్నారు. అది మాత్రమే కాకుండా ‘ఆవిరి’ లో కొత్తదనం కనిపించడం లేదని కూడా నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే దిల్ రాజు గారు తన పంథా మార్చక తప్పని పరిస్థితి వచ్చిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

చిన్న సినిమాల్లో మంచి కంటెంట్ ఉంటే సరే కానీ ఆయన స్థాయికి తగని సినిమాలను తన బ్యానర్ పై రిలీజ్ చేయడం మానుకోవాలని.. కంటెంట్ విషయంలో మరింత శ్రద్ధ తీసుకోవాలని.. తన జడ్జిమెంట్ సరి చూసుకోవాలని.. చివరిగా ప్రమోషన్స్ విషయంలో కూడా అయన దృష్టి సారించాలని ఆయన అభిమానులు కోరుతున్నారు.
Please Read Disclaimer