రాజు గారి కన్ను వెటరన్స్ పై పడిందా?

0

టాలీవుడ్ లో దిల్ రాజు ప్రస్థానం గురించి చెప్పాల్సిన పనిలేదు. సాధారణ డిస్ట్రిబ్యూటర్ గా వ్యాపారం మొదలు పెట్టి నేడు టాలీవుడ్ లో అగ్ర నిర్మాతలలో ఒకరిగా కొనసాగుతున్నారు. కొత్త వాళ్లు నిర్మాతగా రాణించడం అంటే అంత ఈజీ కాదని .. సినిమాల్లో సంపాదించిందనంతే ఇక్కడే పొగొట్టుకున్న వాళ్లే ఎక్కువ ఉన్నారనే విమర్శలు ఉన్న చోట ఆయన అన్ని రూల్స్ ని బ్రేక్ చేసి విజేతగా ముందుకు సాగిపోతున్నారు. ఇప్పటి వరకూ దాదాపు నేటి తరం స్టార్ హీరోలందరితో సినిమాలు చేసారు. అగ్ర హీరోలతో పాటు యంగ్ హీరోలతోనూ కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారారు. అయితే ఇంత చేసినా ఆయనలోనూ ఏదో తెలీని వెలితి.

ఇండస్ట్రీ సెన్సేషనల్ హిట్స్ ఇచ్చిన పలువురు అగ్ర హీరోలతో సినిమాలు తీయాలన్నది ఆయన చిరకాల కోరిక. మెగాస్టార్ చిరంజీవి.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. నటసింహా నందమూరి బాలకృష్ణ.. వంటి స్టార్లతో సినిమాలు తీయాలన్నది నెరవేరని కోరికగా ఉంది. దాని కోసం ఎంత ట్రై చేసినా ఎందుకనో కుదరలేదు ఇంతకాలం. అయితే ఇకపై రాజుగారి చిరకాల కోరిక కూడా త్వరలో తీరబోతుందన్న సిగ్నల్ అందింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలని ఆయన ఇండస్ట్రీకి వచ్చిన నాటి నుంచి కలలు కంటున్నారు. అది ఇప్పటికి తీరబోతోందని ఇటీవల వార్తలొచ్చాయి.

పవన్ తో పింక్ రీమేక్ ని బోనీ కపూర్ తో కలిసి దిల్ రాజు నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే. ఆ ఒక్క స్టార్ తో సినిమా చేస్తే రాజు గారు నేటి తరం హీరోలందరికితో సినిమాలు పూర్తి చేసిన వారవుతారు. అనంతరం వెటరన్ హీరోలను టార్గెట్ చేస్తారట. ఈ నేపథ్యంలో ఇటీవలే నటసింహ బాలకృష్ణను కలిసి తమ బ్యానర్లో ఓ సినిమా చేయాల్సింది గా రాజుగారు కోరారట. అందుకు బాలయ్య తప్పకుండా చేద్దాం. మంచి స్క్రిప్ట్ తో పాటు దర్శకుడిని ఎంపిక చేసి మరోసారి కలవండని చెప్పారుట. దీంతో దిల్ రాజు తప్పకుండా మీకు మీ అభిమానులను మెచ్చే స్క్రిప్ట్ తో మళ్లీ ముందుకొస్తానని చెప్పారట.

రాజుగారి ఒరవడి చూస్తుంటే జూనియర్లు పూర్తయిన నేపథ్యంలో సీనియర్ హీరోలతోనూ సినిమాలు చేసి నిర్మాతగా మరో రికార్డు సాధించేందుకే ఈ స్పీడ్ అని అర్థమవుతోంది. పవన్.. బాలయ్య పూర్తయితే రాజు గారి ఖాతాలో మిగిలింది మెగాస్టార్ చిరంజీవి.. విక్టరీ వెంకటేష్ మాత్రమే. బహుశా రాజు గారి నెక్స్ట్ టార్గెట్ వాళ్లే అయ్యి ఉండొచ్చు అంటూ చర్చ సాగుతోంది. ఆ ముగ్గురు స్టార్లతో రాజు గారికి మంచి సాన్నిహిత్యం ఉంది. ఏం జరగనుంది అన్నది చూడాలి.
Please Read Disclaimer