రాజు గారి వార్నింగ్! ఇంతకీ ఏం తేల్చారు!?

0

తెలుగు సినీపరిశ్రమకి ఊహించని ఉపద్రవం ముంచుకు రాబోతోందా? అది పెను ప్రకంపనాలకు తావివ్వబోతోందా? అంటే అవుననే తాజా సన్నివేశం చెబుతోంది. ఈ లావా ఒక నిశ్శబ్ధ విప్లవంలా దూసుకొస్తోంది. ఇంతకీ ఆ విప్లవం ఏమై ఉంటుంది? అంటే అది కచ్ఛితంగా నిర్మాతల మధ్య `డివైడ్ ఫ్యాక్టర్` అనే చెప్పాలి. ఇన్నాళ్లు నిర్మాతలంతా కలిసే ఉన్నారని బయటి ప్రపంచం నమ్మింది. కానీ మండలిలో ఊహించని రీతిలో కలతలు ఉన్నాయన్నది ఇటీవల ఓ రెండు ఎన్నికలు బయటపెట్టాయి. సినిమాలు తీసేవాళ్లు.. సినిమాలు తీయని వాళ్లు..!! ఇలా రెండు వర్గాలుగా నిర్మాతలంతా విడిపోయారు. ఇందులో సినిమాలు తీసేవాళ్లు సపరేట్ కుంపటి పెట్టుకున్నారు. ఆ కుంపటి పేరు నిర్మాతల గిల్డ్. ఇందులోనే ఏడాది పొడవునా సినిమాలు తీసేవాళ్లు ఉన్నారు. భారీ చిత్రాలు నిర్మించే వాళ్లు చేరారు.

సినిమాలు తీయకుండా కేవలం మండలిలో పెత్తనం చెలాయించేవాళ్లను మెడ పట్టి గెంటేసే ఆలోచనే గిల్డ్ చేస్తోందనే సంకేతాలు అందుతున్నాయి. గ్యారెంటీగా సినిమాలు తీసేవాళ్లు మాత్రమే యాక్టివ్ అసోసియేషన్ గా ఉండబోతోంది. ఇక అసలు మండలి నామమాత్రం కాబోతోందని అర్థమవుతోంది. నిర్మాతల గిల్డ్ వీళ్లతో కలవదు. తమతో కలుపుకోవడానికి ఇష్టపడడం లేదు. సినిమాలు తీయని వాళ్లకు నిర్మాతల మండలి తరపున సంక్షేమ ఫలాలు అందకూడదని గిల్డ్ నిర్మాతలు భావిస్తున్నారు. పైగా సినిమాలు తీయని వాళ్ల పెత్తనాన్ని ఎట్టి పరిస్థితిలో సినిమాలు తీసేవాళ్లు అంగీకరించేందుకు సిద్ధంగా లేరు. ఆ క్రమంలోనే ఇరువర్గాల మధ్య ఆధిపత్య పోరు సాగుతోంది. ఈ పోరాటం వల్ల మండలి అభివృద్ధి కూడా జీరోకి పడిపోయింది.

అయితే ఇలాంటి టైమ్ లో నిర్మాతల మండలి .. ఫిలింఛాంబర్ ఎన్నికల్లో సి.కళ్యాణ్ హవా సాగింది. చిన్న నిర్మాతల సైన్యాన్ని వెంట తిప్పుకుంటూ సి.కళ్యాణ్ ఎన్నికల్లో గెలిచారు. దశాబ్ధాల చరిత్ర ఉన్న నిర్మాతల మండలి నిర్వీర్యం అవుతోందన్న ఆవేదన ఆయనలో కనిపిస్తోంది. నిర్మాతల గిల్డ్ ఆగడాల మీదనా ఆయన చాలా గుర్రుమీద ఉన్నారు. ఫిలింఛాంబర్ వ్యవహారాలు.. మండలి వ్యవహారాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న ఆయన గిల్డ్ వాళ్లను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తమతో కలవాలని.. అందరినీ కలుపుకునే వెళతామని అంటున్నా.. నిర్మాతల గిల్డ్ అందుకు సుముఖంగా లేదనే సన్నివేశం చెబుతోంది. నిన్న ఫిలింఛాంబర్ ఎన్నికల వేళ `వార్` నడిపిస్తాం అంటూ సి.కళ్యాణ్ వార్నింగ్ ఇచ్చారు. దానికి స్పందించిన గిల్డ్ ప్రతినిధి దిల్ రాజు `ఎవరూ ఏమీ చేయలేరు!` అంటూ కౌంటర్ ఇచ్చారు. పైగా సాయంత్రం 5 గం.లకు సినిమాలు తీసేవాళ్లు ఓ నిర్ణయానికి వస్తారు. ఆపై తేలుస్తాం! అంటూ నర్మగర్భ వ్యాఖ్యలతో హెచ్చరికలు జారీ చేశారు. అయితే ఆ తర్వత ఏం జరిగింది? సాయంత్రం తేల్చేది ఏంటో మాత్రం దిల్ రాజు ఇంకా చెప్పలేదు. ఇంతకీ నిర్మాతల గిల్డ్ నుంచి ఎలాంటి ప్రకటన రాబోతోంది? వాళ్ల మైండ్ లో ఏం ఉంది? అన్నది రాజు గారే చెబుతారేమో.. జస్ట్ వెయిట్..
Please Read Disclaimer