సురేష్ బాబు గారి కోసం దిల్ రాజుగారు..!

0

సీనియర్ నిర్మాత సురేష్ బాబు నిర్మాణంలో తెరకెక్కిన ‘వెంకీమామ’ విడుదల తేదీపై గత కొన్ని రోజులుగా తికమక మకతిక జోరుగా కొనసాగుతోంది. దీంతో చిరాకు పుట్టిన వెంకీ.. చైతు అభిమానులు ‘రిలీజ్ డేట్ తేల్చండి మహాప్రభో’ అంటూ సోషల్ మీడియా రచ్చబండకెక్కి హ్యాష్ టాగ్స్ కూడా ట్రెండ్ చేశారంటేనే పరిస్థితి ఎంత దూరం పోయిందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ రిలీజ్ డేట్ పై రానా కూడా ఒక సెటైర్ వీడియోను తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఆ వీడియోలో బాబీని ముందు రిలీజ్ డేట్ సంగతి చెప్పమని రానా అడగడం కూడా నెటిజన్లకు కనెక్ట్ అయింది.

ఇదంతా ఒక ఎత్తైతే నిన్న సురేష్ బాబు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి చివరి నిముషంలో రద్దు చేశారు. ప్రెస్ మీట్ అనగానే ‘వెంకీమామ’ రిలీజ్ డేట్ గురించి ప్రకటిస్తారని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తే ఇలా ప్రెస్ మీట్ క్యాన్సిల్ చేయడం చాలామందిని నిరాశపరిచింది. మరోవైపు దిల్ రాజు కూడా ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి లాస్ట్ మినిట్ లో క్యాన్సిల్ చేశారు. దిల్ రాజు గారు నిర్మించిన ‘ఇద్దరిలోకం ఒకటే’ సినిమాను మొదట డిసెంబర్ 25 న విడుదల చేయాలని ప్లాన్ చేశారని.. అయితే తాజాగా డిసెంబర్ 13 కు ఫిక్స్ చేసి ఆ డేట్ ను ప్రకటించేందుకే రాజుగారు ప్రెస్ మీట్ పెట్టుకున్నారట. కానీ అటు సురేష్ బాబు ‘వెంకీమామ’ సినిమాను అదే తారీఖును ఖరారు చేసుకొని రాజుగారికి సమాచారం ఇవ్వడంతో రాజుగారు ప్రెస్ మీట్ క్యాన్సిల్ చేశారట.

నిర్మాతల మధ్య ఈ అండర్ స్టాండింగ్ అంతా బాగానే ఉంది కానీ ఇప్పటివరకూ రిలీజ్ డేట్ అయితే ప్రకటించలేదు. పది రోజులే సమయం ఉన్నా ఇంకా విడుదల తేదీలపై కన్ఫ్యూజన్ కొనసాగడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. మరోవైపు ఇతర సినిమాల నిర్మాతలు ఈ ‘వెంకీమామ’ సినిమా విషయం తెలిస్తే తమ సినిమాల రిలీజ్ డేట్లలో మార్పు చేర్పులు చేసుకుందామని ఎదురుచూస్తున్నారట. ఏదేమైనా సురేష్ మామగారు అందరిని తికమకపెడుతున్నారని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.
Please Read Disclaimer