విడుదలకు ముందు నిజం చెప్పిన రాజుగారు

0

ఉయ్యాల జంపాల చిత్రంతో ఒక్కసారిగా హీరోగా మంచి గుర్తింపు దక్కించుకుని ఆ తర్వాత సినిమా చూపిస్తా మామతో జూనియర్ మాస్ మహారాజా అనిపించుకున్న రాజ్ తరుణ్ ఈమద్య కాలంలో చేసిన సినిమాలు వరుసగా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడుతూ వస్తున్నాయి. ఇలాంటి సమయంలో రాజ్ తరుణ్ చాలా నమ్మకం పెట్టుకుని చేసిన సినిమా ‘ఇద్దరి లోకం ఒక్కటే’. ఈ సినిమాను దిల్ రాజు నిర్మించడం వల్ల సినిమాపై ఇండస్ట్రీ వర్గాల్లో కాస్త ఆసక్తి ఉంది.

ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన ఒక కార్యక్రమంలో మీడియాతో మాట్లాడిన దిల్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ సినిమాను ఒక టర్కీ సినిమాను ఇన్సిపిరేషన్ గా తీసుకుని చేసినట్లుగా దిల్ రాజు పేర్కొన్నాడు. మొదటగా ఆ టర్కీ సినిమాను చూసిన దర్శకుడు కృష్ణ స్టోరీ లైన్ నచ్చి తప్పకుండా చేయాలనుకున్నాడు. రాజ్ తరుణ్ ఆ కథను తెలుసుకున్న తర్వాత నటించాలని ఆసక్తి పెంచుకున్నాడు. స్వయంగా రాజ్ తరుణ్ ఈ కథను దిల్ రాజు వద్దకు తీసుకు వెళ్లాడట.

దిల్ రాజు కూడా ఈ సినిమా కథ తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా ఉంటుందనే నిర్ణయానికి వచ్చి నిర్మించేందుకు ముందుకు వచ్చాడట. మీడియం బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమాను ఈనెల 25న ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక ఈ చిత్రం ఎఫ్2 మరియు మహర్షి చిత్రాల తర్వాత ఈ ఏడాది తమ బ్యానర్ కు హ్యాటిక్ ను ఇవ్వబోతుందనే నమ్మకంతో దిల్ రాజు ఉన్నాడు.

గత ఏడాది దిల్ రాజు బ్యానర్ లో రాజ్ తరుణ్ ‘లవర్’ చిత్రం వచ్చి నిరాశ పర్చింది. ఆ సినిమా రాజుగారికి చాలా నష్టపర్చిందట. అయినా కూడా ఈ కథపై నమ్మకంతో మరోసారి రాజ్ తరుణ్ తో సినిమా చేశాడు. ఈ సినిమా విడుదల మరికొన్ని రోజులు ఉందనగా ఇది టర్కీ సినిమాకు రీమేక్ అంటూ దిల్ రాజు ప్రకటించడం వెనుక ఉన్న ఉద్దేశ్యం ఏంటో ఆయనే చెప్పాలి.
Please Read Disclaimer