దర్శకేంద్రుడి ‘పెళ్లిసందడి’ మళ్ళీ మొదలవ్వనుంది…!

0

తెలుగు సినీ చరిత్రలో నిలిచిపోయే దర్శకులలో దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు ఒకరు. కమర్షియల్ మూవీస్ కు కేరాఫ్ అడ్రస్ అయిన రాఘవేంద్రరావు.. నవరసాలు కలబోసిన చిత్రాలను తీసి సినీ ప్రేక్షకులను అలరించాడు. సినిమాని అందమైన దృశ్యకావ్యంగా తీర్చిదిద్దే రాఘవేంద్రుడు.. నటీనటుల నుండి అదే స్థాయిలో నటన కూడా రాబట్టుకుంటాడనే పేరుంది. టాలీవుడ్ లో ఒకప్పటి సీనియర్ హీరోలందరితో సినిమాలు తీసిన రాఘవేంద్రరావు.. ఈ జనరేషన్ హీరోలతో కూడా సినిమాలు రూపొందించారు. అయితే ఈ మధ్య కాస్త గ్యాప్ తీసుకున్న దర్శకేంద్రుడు మళ్లీ మెగాఫోన్ పట్టబోతున్నారు. ఈ విషయాన్ని ఆయన తన ట్విట్టర్ ఖాతా ద్వారా అధికారికంగా ప్రకటించారు. ఇటీవలే త్వరలోనే ఓ న్యూస్ చెబుతానని చెప్పిన ఆయన.. తాజాగా ”పెళ్లిసందడి” సినిమా చేయబోతున్నట్లు ప్రకటించాడు.

రాఘవేంద్రరావు ‘పెళ్లిసందడి” మళ్ళీ మొదలవ్వబోతుంది.. తారాగణం త్వరలో.. అని ట్వీట్ చేస్తూ తాను డైరెక్ట్ చేయబోయే సినిమా టైటిల్ అనౌన్స్ చేశాడు. దీనికి తనశైలిలో ఓ వీడియో జత చేసి సాంకేతిక నిపుణుల వివరాలు తెలియజేసారు. ఈ చిత్రాన్ని ఆర్.కె.ఫిలింస్ మరియు ఆర్కా మీడియా వర్క్స్ బ్యానర్స్ పై మాధవి కోవెలమూడి – శోభు యార్లగడ్డ – ప్రసాద్ దేవినేని కలిసి నిర్మించనున్నారు. రాఘవేంద్రరావు ఆస్థాన సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి సంగీతం సమకూర్చనున్నారు. శివశక్తి దత్తా – చంద్రబోస్ లు ఈ పాటలకు సాహిత్యాన్ని అందించనున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మ్యూజిక్ ప్రొడక్షన్ ప్రారంభమైందని.. త్వరలోనే నటీనటుల వివరాలు తెలియజేస్తామని ప్రకటించారు. రాఘవేంద్రరావు దర్శకత్వంలో శ్రీకాంత్ – రవళి – దీప్తి భట్నాగర్ హీరో హీరోయిన్లుగా ‘పెళ్లి సందడి’ (1996) అనే సినిమా తెరకెక్కించిన సంగతి తెలిసిందే.