సినీ ఇండస్ట్రీలో విషాదం: షూటింగ్ లో గాయపడ్డ అసిస్టెంట్ దర్శకుడి మరణం

0

ఓ అసిస్టెంట్ దర్శకుడి మరణంతో తెలుగు సినీ ఇండస్ట్రీ విషాదంలో కూరుకుపోయింది. షూటింగ్ స్పాట్ వద్ద జరిగిన ప్రమాదంలో గాయపడ్డ అతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అశువులు బాసాడు. ప్రముఖ దర్శకుడి దగ్గర పని చేస్తూ మంచి పేరు తెచ్చుకున్న అతడు..తాజాగా దర్శకత్వం చేసే అవకాశం కూడా దక్కిన సమయంలో అనుకోకుండా ఇలా ప్రమాదం బారిన పడి మరణించడంతో విషాద ఛాయలు నెలకొన్నాయి. విషయం తెలుసుకుని పలువురు నటీ నటులు తమ సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ప్రముఖ డైరక్టర్ సుధీర్ వర్మ దగ్గర ప్రవీణ్ రణరంగం తదితర సినిమాలకు అసిస్టెంట్ దర్శకుడిగా పని చేసారు. అల్లు అరవింద్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆహా ఓటీటీలో ఓ చిన్న సినిమా తెరకెక్కించే అవకాశం ప్రవీణ్ కు దక్కింది.

కొద్ది రోజుల కిందటే ఆ సినిమా షూటింగ్ కూడా ప్రారంభించి చిత్రీకరణ దాదాపు పూర్తి చేశారు. కొన్ని సన్నివేశాలు మిగిలి ఉండగా వాటిని షూటింగ్ చేస్తున్నారు. చివరగా షూటింగ్ జరుగుతుండగా కారు నడపాల్సిన సీన్ ఒకటి చిత్రీకరించాల్సి ఉంది. సీన్ వివరించే క్రమంలోనో ..లేకుంటే స్వయంగా తానే కారు నడిపినా సరిపోతుందని భావించడం వల్లో ప్రవీణ్ స్వయంగా కారు డ్రైవింగ్ చేశారు. దానిని షూటింగ్ చేస్తుండగా అనుకోని విధంగా ఆ కారు ప్రమాదానికి గురైంది. ప్రవీణ్ తీవ్రంగా గాయపడ్డాడు. స్పాట్ లో ఉన్న సహచరులు ఆయన్ను ఆస్పత్రికి తరలించగా వారం రోజులపాటు మృత్యువుతో పోరాడి చివరికి కన్నుమూశారు. వర్ధమాన దర్శకుడి మృతితో టాలీవుడ్ లో విషాదం అలుముకుంది. పలువురు దర్శకులు నటీనటులు ప్రవీణ్ కుటుంబానికి సంతాపం వ్యక్తం చేశారు.