ప్రమోషన్స్ రావు కాని అవార్డులైతే కావాలా?

0

నయనతార సినీ కెరీర్ ప్రారంభించి చాలా కాలం అయ్యింది. గత దశాబ్ద కాలంగా నయనతార స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలుగుతోంది. లేడీ సూపర్ స్టార్ అంటూ అభిమానులతో పిలిపించుకుంటున్న ఈ అమ్మడు ప్రస్తుతం సౌత్ సినీ ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్ గా నిలిచింది. ఒక సినిమాకు హీరోయిన్ గా చేసిన ఎవరైనా సినిమా ఆరంభం నుండి ప్రేక్షకుల ముందుకు వచ్చే వరకు ఆ తర్వాత కూడా సినిమా కోసం పని చేస్తూనే ఉంటారు. అంటే సినిమా విడుదల సమయంలో పబ్లిసిటీ కార్యక్రమాల్లో పాల్గొనడం.. విడుదలైన తర్వాత కూడా సినిమాను ప్రమోట్ చేసేందుకు ఏవైనా కార్యక్రమాల్లో పాల్గొనడం చేస్తూ ఉంటారు.

లేడీ సూపర్ స్టార్ అంటూ పిలిపించుకుంటున్న నయనతార మాత్రం తాను నటించిన ఏ ఒక్క సినీ వేడుకలో పాల్గొనదు. చాలా ఏళ్ల క్రితం శ్రీరామ రాజ్యం ఆడియో వేడుకలో పాల్గొన్న నయతార ఆ తర్వాత ఎప్పుడు కూడా కనిపించలేదు. ఆ మద్య సైరా చిత్రం కోసం ఈమెను తీసుకు వచ్చేందుకు చాలానే ప్రయత్నాలు జరిగాయి. కాని నో చెప్పింది. మొన్నటి బిగిల్.. నేడు విడుదలైన దర్బార్ చిత్రాల ప్రమోషన్స్ కూడా ఈమెకు పట్టలేదు. కేవలం నటించామా వెళ్లి పోయామా అన్నట్లుగానే ఈమె ప్రవర్తిస్తూ ఉంటుంది.

నయనతార ఈ విషయమై చాలా కాలంగా విమర్శలు ఎదుర్కొంటూనే ఉంది. పబ్లిక్ ఈవెంట్స్ లో పాల్గొనడం ఈమెకు ఇష్టం ఉండదు కనుక హాజరు కాదులే అని కొందరు అనుకుంటూ ఉంటారు. కాని ఇటీవల ఒక టీవీ ఛానెల్ నిర్వహించిన అవార్డు వేడుకలో పాల్గొనడం తో ఈమెపై కోలీవుడ్ దర్శక నిర్మాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ సినిమాల్లో నటించడం వల్ల వచ్చే అవార్డులు అందుకునేందుకు అవార్డు వేడుకలకు వెళ్తావు.. కాని మా సినిమాల పబ్లిసిటీ కోసం మాత్రం నువ్వు ఎందుకు రావు అంటూ ప్రశ్నిస్తున్నారు. వారి ఆవేదనలో అర్థం ఉంది.. ఇప్పటికైనా నయన్ పబ్లిసిటీ కార్యక్రమాల్లో పాల్గొంటే బాగుంటుందని అభిమానులు కూడా అభిప్రాయపడుతున్నారు.
Please Read Disclaimer