టాలీవుడ్ డ్రీమ్ గర్ల్ ఎవరు ఇంతకీ?

0

బాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న యువనటుడు ఆయుష్మాన్ ఖురానా. విక్కీడోనర్.. అంధాదున్ లాంటి జాతీయ అవార్డు సినిమాల్ని ఖాతాలో వేసుకున్నాడు. అతడు ఓ కథని ఎంపిక చేసుకున్నాడు అంటే అది బ్లాక్ బస్టర్ అని ఫిక్సవ్వాల్సిందే. అవార్డులు బోనస్. ఆయుష్మాన్ నటించిన విక్కీ డోనర్ చిత్రాన్ని పలు భాషల్లోకి రీమేక్ చేస్తే అన్నిచోట్లా విమర్శకుల ప్రశంసలు దక్కాయి. తెలుగులో సుమంత్ హీరోగా ఈ చిత్రాన్ని రీమేక్ చేశారు. ఇక్కడా ప్రశంసలు దక్కాయి.

ప్రస్తుతం ఆయుష్మాన్ నటించిన `అంధాదున్` చిత్రాన్ని తెలుగులో నాని హీరోగా రీమేక్ చేస్తున్నారని వార్తలు వచ్చాయి. ఈ ప్రాజెక్ట్ ఇంకా ప్రాధమిక దశలో ఉంది. అటు తమిళంలో ప్రశాంత్ కథానాయకుడిగా రీమేక్ ఫైనల్ అయ్యింది. ఈలోగానే ఆయుష్మాన్ నటిస్తున్న తాజా చిత్రం `డ్రీమ్ గర్ల్`ని తెలుగులో రీమేక్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆయుష్మాన్ వీరాభిమాని అగ్ర నిర్మాత డి.సురేష్ బాబు ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే రైట్స్ కొన్నారు. ఇందులో రాజ్ తరుణ్ హీరోగా నటించనున్నాడని కొంత కాలంగా వార్తలు వస్తున్నాయి. సెప్టెంబర్ 13న బాలీవుడ్ లో డ్రీమ్ గర్ల్ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. ఈలోగానే తెలుగు రీమేక్ వార్తలు వేడి పెంచుతున్నాయి.

ఆయుష్మాన్ ఖురానా- నుష్రాత్ బరుచా జంటగా నటిస్తున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ `డ్రీమ్ గర్ల్`. బాలాజీ టెలీఫిల్మ్స్ సమర్పణలో.. శోభా కపూర్- ఏక్తా కపూర్ నిర్మిస్తుండగా.. రాజ్ శాండిల్య డైరెక్ట్ చేస్తున్నాడు. ఇటీవల రిలీజ్ చేసిన థియేట్రికల్ ట్రైలర్ ఆకట్టుకుంది. సందర్భానుసారం వచ్చే కామెడీ.. ఫన్ ట్రైలర్ లో మెప్పించింది. ఈ సినిమా రిలీజ్ ముందే రాజ్ తరుణ్ తో రీమేక్ ఖాయమైందన్న వార్తలు వస్తున్నాయి. ఓ బేబి లాంటి రీమేక్ తో డి.సురేష్ బాబు బృందం బ్లాక్ బస్టర్ విజయం అందుకున్నారు. తాజాగా `డ్రీమ్ గర్ల్` రీమేక్ పై మనసు పారేసుకున్నారు. ఈ చిత్రానికి ఎవరు దర్శకత్వం వహిస్తారు? కథానాయిక సహా ఇతర కాస్టింగ్ ఎవరు? అన్న వివరాలు తెలియాల్సి ఉందింకా.
Please Read Disclaimer