రోజ్ వ్యాలీ స్కాంలో సూపర్ స్టార్ కు నోటీసులు

0

బెంగాల్ సినీ పరిశ్రమను కుదిపేస్తున్న రోజ్ వ్యాలీ స్కాంలో ఇప్పటికే పలువురు సినీ తారలు.. రాజకీయ నాయకులు మరియు అధికారులు అరెస్ట్ అయిన విషయం తెల్సిందే. తాజాగా ఈ స్కాం కు సంబంధించిన విచారణలో భాగంగా ప్రముఖ నటి రీతూపర్ణకు ఈడీ నోటీసులు జారీ చేయడం జరిగింది. వారం రోజుల్లో విచారణ కోసం హాజరవ్వాల్సిందిగా నోటీసుల్లో పేర్కొన్నారు. హిందీ బెంగాలీ చిత్రాలతో పాటు తెలుగు సినిమాలో కూడా ఈమె నటించింది. ఎస్వీ కృష్ణా రెడ్డి దర్శకత్వంలో గతంలో వచ్చిన ‘ఘటోత్కచుడు’ చిత్రంలో ఈమె నటించింది.

రీతూ పర్ణతో పాటు ఈ స్కాంలో బెంగాల్ సూపర్ స్టార్ గా స్టార్ డం ఉన్న ప్రసేన్ జిత్ ఛటర్జీ హస్తమున్నట్లుగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 2010 – 12 సంవత్సరాల మద్యలో రోజ్ వ్యాలీ కంపెనీ నేతృత్వంలో పలు సినిమాలు నిర్మాణం జరిగాయి. ఆ సమయంలోనే కంపెనీతో ఛటర్జీ నగదు లావాదేవీలు జరిపినట్లుగా ఈడీ వద్ద సమాచారం ఉంది. ఆ కారణంగానే ఆయన్ను కూడా విచారించేందుకు ఈడీ సిద్దం అయ్యింది.

జులై 19 వరకు ఛటర్జీ ఈడీ ముందు హాజరు అవ్వాలంటూ నోటీసుల్లో పేర్కొనడం జరిగింది. సూపర్ స్టార్ కు ఈడీ నుండి నోటీసులు రావడంతో బెంగాల్ సినిమా పరిశ్రమలో పెను సంచలనంగా చెప్పుకోవచ్చు. ఇప్పటికే బెంగాల్ సినీ పరిశ్రమకు చెందిన పలువురు ఈ కుంభకోణంలో ఉన్నట్లుగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదే సమయంలో సూపర్ స్టార్ కూడా ఈ స్కాంలో ఉన్నాడనే అనుమానంతో ఈడీ నోటీసులు ఇవ్వడం మరింత సంచలనంగా మారింది. ప్రముఖ బెంగాలీ నిర్మాత శ్రీకాంత్ మెహతా ఇప్పటికే 25 కోట్ల రూపాయలను తీసుకున్నట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటూ విచారణ ఎదుర్కొంటున్నాడు. ఇక గతంలో ఈ కేసును విచారించిన ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారి రాజీవ్ కుమార్ ను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కేసు మరెన్ని మలుపులు తిరుగుతుందో అంటూ దేశ వ్యాప్తంగా ఆసక్తి వ్యక్తం అవుతోంది.
Please Read Disclaimer