భర్తను చంపేసిన హీరోయిన్.. అసలు ఏం జరిగింది?

0

ఎన్నో ఆశలతో అందమైన అబ్బాయిని పెళ్లిచేసుకుంది ఆ అమ్మాయి. ఆ అమ్మాయి తన లైఫ్‌లోకి రావడం గొప్ప అదృష్టంగా భావించాడు ఆ అబ్బాయి. మంచి సంపాదన, ప్రశాంతమైన జీవితం. కానీ, ఏం జరిగిందో తెలీదు.. ఆ అబ్బాయి హత్యకు గురయ్యాడు. పోలీసులు, హడావుడి, అసలు ఎవరు చంపారు అనే ప్రశ్నలతో ఆమెకు పిచ్చెక్కింది. ఆఖరికి తన భర్తను చంపింది తానేనని అంగీకరించింది ఆ అమ్మాయి. ఇదంతా బయట ఎక్కడో జరిగిందని అనుకుంటున్నారా? కాదండి ‘రాగల 24 గంటల్లో’ సినిమాలో..!

‘అంతకు ముందుకు ఆ తరివాత’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన తెలుగమ్మాయి ఈషా రెబ్బా తెలుగు, తమిళ భాషల్లో వరుసపెట్టి సినిమాలు చేసుకుంటూ వస్తోంది. అయితే, ఇంకా ఆమెకు సరైన బ్రేక్ రాలేదు. ఇప్పటి వరకు హీరోయిన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేసిన ఈషా రెబ్బా.. తొలిసారి లేడీ ఓరియెండెట్ సినిమాలో నటించింది. అదే ‘రాగల 24 గంటల్లో’. సత్యదేవ్, శ్రీరామ్, ముస్కాన్ ముఖ్యపాత్రలు పోషించారు. శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వం వహించారు. సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్ర ట్రైలర్‌ను లెజెండరీ దర్శకుడు కె.రాఘవేంద్రరావు బుధవారం విడుదల చేసారు.

ఈ ట్రైలర్ చాలా ఆసక్తికరంగా ఉంది. ఒక మర్డర్ చుట్టూ తిరిగే సస్పెన్స్ థ్రిల్లర్ ఇది. సినిమాలో ఈషా రెబ్బా భర్తగా నటించిన సత్యదేవ్ హత్యకు గురవుతాడు. ఆ హత్య ఎవరు చేశారన్నదే సస్పెన్స్. కానీ, ట్రైలర్ చివరలో తన భర్తను తానే చంపినట్టు ఈషా రెబ్బా చెబుతుంది. అంటే, దీనిలో ఏదో మెలిక ఉన్నట్టు అర్థమవుతోంది. అదేంటో సినిమాలోనే చూడాలి. ఈ సినిమాకు రఘు కుంచె సంగీతం సమకూర్చారు. శ్రీ నవ్‌హాస్ క్రియేషన్స్ బ్యానర్‌పై శ్రీనివాస్ కానూరు నిర్మించారు. శ్రీ కార్తికేయ సెల్యూలాయిడ్స్ ఈ సినిమాను సమర్పిస్తోంది. నవంబర్ 15న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
Please Read Disclaimer