మా అధ్యక్షుడిగా ‘నరేష్’ ఔటేనా?

0

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు ‘శివాజీరాజా’ను ఓడించి గద్దెనెక్కిన నరేష్ జీవితారాజశేఖర్ ల మధ్య ఆరు నెలలు గడువక ముందే గొడవలు మొదలవ్వడం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. వీరిద్దరి టీం మా అసోసియేషన్ లో సమూల మార్పులు తెస్తామని బీరాలు పలికింది.. తెలుగు సినిమా పరిశ్రమకు భారీ హామీలే ఇచ్చి ఎన్నికల్లో గెలిచారు. కానీ ఆరు నెలల గడువక ముందే విభేదాలతో రచ్చకెక్కారు..

‘మా’ అసోసియేషన్ ఇప్పుడు విడిపోయింది. ఆదివారం అసోసియేషన్ జనరల్ బాడీ సమావేశంలో అధ్యక్షుడు నరేష్ ను పక్కనపెట్టి జీవిత రాజశేఖర్ నిర్వహించిన సమావేశంతో వీరి మధ్య విభేదాలు పొడచూపాయి. అధ్యక్షుడు నరేష్ వ్యవహారశైలితో ఎక్కువ మంది సభ్యులు విసుగుచెందారని అందుకే ఆయనను దూరంగా పెట్టామని వైస్ ప్రెసిడెంట్ రాజశేఖర్ తెలిపారు. ఎన్నికల ముందర ఎన్నో పనులు చేస్తామని గద్దెనెక్కిన నరేష్ ఆ తర్వాత ఈ ఆరునెలల్లో అసోసియేషన్ శ్రేయస్సు సంక్షేమం కోసం ఏమాత్రం పాటుపడలేదని ఆరోపించారు. ఇచ్చిన హామీలు అమలు చేయలేదని.. ఫండ్స్ కూడా కలెక్ట్ చేయలేదని.. పాత డబ్బే ఖర్చు చేశారని ఆరోపించారు.

ఈ ఆరోపణలు చేశాక నరేష్ ను అధ్యక్ష పదవి నుంచి తొలగించాలనే యోచనలో జీవిత రాజశేఖర్ నేతృత్వంలోని మా అసోసియేషన్ సభ్యులు ఉన్నారనే అభిప్రాయం వ్యక్తమైంది. జనరల్ బాడీ సమావేశం త్వరలోనే నిర్వహించి నరేష్ కు ఉద్వాసన పలకడానికి రంగం సిద్ధం చేస్తున్నట్టు సమాచారం అందుతోంది.

టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ప్రస్తుతం నరేష్ ఫుల్ స్వింగ్ లో ఉన్నారు. బిజీగా సినిమాల్లో నటిస్తున్నాడు. అందుకే ఆరు నెలలుగా మా కార్యకలాపాలకు తన సమయాన్ని కేటాయించడం లేదని తెలుస్తోంది. ఇక నరేష్ వ్యవహారశైలి కూడా ‘మా’లో విభేదాలకు కారణమవుతోంది.
Please Read Disclaimer