అవార్డు వేడుకలో ఎమోషనల్ మూమెంట్స్

0

అక్కినేని ఫ్యామిలీ ప్రతిష్టాత్మకంగా ప్రతి ఏడాది ఇచ్చే ఏఎన్నార్ జాతీయ అవార్డు వేడుక ఈ ఏడాదికి గాను నిన్న అన్నపూర్ణ స్టూడియోలో జరిగింది. 2018 మరియు 2019 ఏఎన్నార్ జాతీయ అవార్డులను శ్రీదేవి మరియు రేఖలకు అందజేయడం జరిగింది. అవార్డు వేడుకలో ముఖ్య అతిథిగా చిరంజీవి పాల్గొనగా నాగార్జున హోస్ట్ గా అలరించాడు. నాగార్జున హోస్టింగ్ చేసినంత సమయం చాలా సరదాగా కార్యక్రమాన్ని నడిపాడు. కాని ఎప్పుడైతే తండ్రి గురించి మాట్లాడాడో అప్పుడు అవార్డు వేడుక మొత్తం ఎమోషనల్ అయ్యింది.

ఎప్పటిలాగే నాగార్జున తన తండ్రి ఏఎన్నార్ ను గురించి మాట్లాడటం ప్రారంభించిన వెంటనే ఎమోషనల్ అయ్యారు. కళ్లలో నీళ్లు తిరగడంతో పాటు గద్గద స్వరంలో మాట్లాడాడు. తన తండ్రి పేరిట ఇస్తున్న అవార్డు గురించి నాగార్జున మాట్లాడుతూ సినిమా నాకు సర్వస్వం. సినిమా నాకు ఎంతో ఇచ్చింది. తల్లిలాంటి సినిమా రుణం కొంతైనా తీర్చుకునే ఉద్దేశ్యంతోనే ఈ జాతీయ అవార్డులను గొప్ప వారికి ఇస్తున్నట్లుగా ఆయన చెప్పుకొచ్చారు.

నాన్నగారి సంకల్పమే నేడు మమ్ములను నడిపిస్తుంది. ఆయన స్ఫూర్తితో మేమంతా ముందుకు వెళ్తున్నామంటూ నాగార్జున కన్నీరు పెట్టుకున్నారు. నాగార్జునతో పాటు ఈ అవార్డు వేడుకలో బోణీ కపూర్ కూడా కన్నీరు పెట్టుకోవడం జరిగింది. తన భార్య శ్రీదేవికి వచ్చిన ఏఎన్నార్ అవార్డును బోణీ కపూర్ అందుకున్నాడు. అవార్డు తీసుకున్న తర్వాత ఆయన మాట్లాడుతూ కన్నీరు పెట్టుకున్నాడు. మొత్తానికి ఏఎన్నార్ అవార్డు వేడుక సరదాగానే కాకుండా ఎమోషనల్ మూమెంట్స్ తో సాగింది.
Please Read Disclaimer