గురువును వదిలేసి శిష్యుడికి ఛాన్సిచ్చినా కానీ..!!

0

సూపర్ స్టార్ మహేష్ .. స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ మధ్య ఫికర్ గురించి తెలిసిందే. ఆయన సక్సెస్ డైరెక్టర్ల వెంట పడతారు! అంటూ మహేష్ పై పూరి అసహనం వ్యక్తం చేయడం అనంతరం పూరీని శాంతపరిచేందుకు నమ్రత నేరుగా ఆయన వద్దకే వెళ్లి మరో స్క్రిప్టు వినిపించాల్సిందిగా కోరడం వగైరా వగైరా ఎపిసోడ్స్ గురించి పరిశ్రమలో గుసగుసలు వినిపించాయి.

మహేష్ తో జనగనమన చేయాలని పూరి భావించారు. కానీ స్క్రిప్టు పరంగా వంద శాతం సంతృప్తి చెందని మహేష్ నిర్ధయగా తిరస్కరించారు. అప్పటికే ఫ్లాపుల్లో ఉన్న పూరి అంతో ఇంతో హర్టవ్వడం అనంతరం ఎమోషనల్ కామెంట్లు చేయడం ఇవన్నీ మీడియాలో కథనాలుగా వెలువడ్డాయి.

కానీ అవన్నీ గతం గతః. పరిశ్రమలో ఇలాంటివన్నీ మామూలే. ఇప్పుడు పూరి సరైన స్క్రిప్టు తేవాలే కానీ నటించేందుకు మహేష్ కి ఎలాంటి అభ్యంతరం లేదు. అందుకేనేమో.. నేడు `సర్కార్ వారి పాట` అధికారిక లాంచింగ్ సందర్భంగా పూరి చేసిన ట్వీట్ హీటెక్కిస్తోంది. తన శిష్యుడు పరశురామ్ మహేష్ ని డైరెక్ట్ చేస్తున్నాడు. మహేష్ – పరశురామ్ కాంబో మూవీ `సర్కార్ వారి పాట` అధికారికంగా పూజా కార్యక్రమాలతో లాంచ్ అవ్వడంతో ఇది ఇండస్ట్రీలో ట్రెండ్ సెట్టర్ అవుతుందని పూరి అభిలషించారు.

మహేష్ అభిమానులకు ఎస్వీపీ పెద్ద ట్రీట్ అవుతుంది అంటూ చిత్రబృందాన్ని పూరి అభినందించారు. పరశురామ్ కు ఈ మూవీ ‘అత్యంత ఎగ్జయిటెడ్ వెంచర్’ అని అభివర్ణించారు పూరి. మహేష్ బాబు అభిమానులందరికీ తప్పకుండా ఈ చిత్రం పెద్ద ట్రీట్ అవుతుందని ప్రకటించి పూరి ఒక్కసారిగా మూవీపై అంచనాలను పెంచారు. తన శిష్యుడే కదా పరశురామ్.. అందుకే పూరీకి అసలు కథంతా తెలుసన్నమాట.